వేలూరు, న్యూస్‌లైన్: కుటుంబ కలహాలతో క్షణికావేశంతో భార్యను హత్య చేసి కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన తిరువణ్ణామలై జిల్లాలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. తిరువణ్ణామలైలోని గాంధీనగర్‌కు చెందిన పుగళేంది(36) సినిమా థియేటర్‌లో క్యాంటీన్‌లో పనిచేస్తున్నాడు. ఇతని భార్య భవాని(30). వీరికి సంజయ్(14), సౌమ్య(12) పిల్లలు. వీరు తిరువణ్ణామలైలోని ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. వీరు పాఠశాల ముగించుకొని రామ్‌జీనగర్‌లోని తాత మారిముత్తు ఇంటికి ప్రతిరోజూ వెళ్లేవారు. బుధవారం సాయంత్రం కూడా వెళ్లారు. గురువారం ఉదయం గాంధీనగర్‌లోని ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో ఇంటికి వెళ్లి చూడగా తల్లి భవాని రక్తపు మడుగులో మృతి చెంది ఉండగా, తండ్రి పుగళేందిఉరి వేసుకొని ఉండడాన్ని చూసి కేకలు వేశారు.
కేకలు విన్న స్థానికులు వచ్చి చూడగా అప్పటికే ఇద్దరూ మృతి చెంది ఉండడాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఇదిలా ఉండగా పుగళేంది భార్యను అనుమానించేవాడని, ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ ఏర్పడి భవానిని హత్య చేసి ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చునని స్థానికులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. తల్లిదండ్రులు మృతి చెందడంతో చిన్నారుల రోదనలు చూసి స్థానికులు కన్నీరు మున్నీరు అయ్యారు.
భార్యను హత్యచేసి ఆత్మహత్య
Published Thu, Feb 20 2014 11:16 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement
Advertisement