రూ. 32వేల కోట్లతో అమరావతిలో వసతులు
అమరావతి నగరంలో వచ్చే నాలుగేళ్లలో రూ. 32,500 కోట్లతో మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించినట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. విజయవాడలోని తన కార్యాలయంలో అమరావతి నిర్మాణంపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన.. రాజధాని నగరం దేశానికి తలమానికంగా నిలిచేలా మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఇందుకోసం పదేళ్లలో సుమారు రూ. 43 వేల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించామని, ఇందులో అధికభాగం వచ్చే నాలుగేళ్లలోనే వినియోగిస్తామని అన్నారు.
దేశంలోని టాప్ టెన్ విద్యాసంస్థలు, అంతర్జాతీయ విద్యాసంస్థలు అన్నింటినీ అమరావతిలో నెలకొల్పేలా అధికారులు కృషి చేయాలని చంద్రబాబు చెప్పారు. రాజధానికి తలమానికంగా నిలిచే సంస్థలకు మాత్రమే కోర్ క్యాపిటల్‌లో భూములు కేటాయించాలని ఆయన తెలిపారు. 15 ఏళ్లలో అమరావతిని మెగాసిటీగా మలచాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే అన్నిరంగాల్లోనే వృద్ధిచెందేలా చూడాలన్నారు.