మళ్లీ తెరపైకి రజనీ
చెన్నై, సాక్షి ప్రతినిధి:రాష్ట్ర రాజకీయాల్లో విజయసోపానాలకు అనాదిగా సినీ ప్రముఖులే కారకులవుతున్నారు. అనాటి అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత ఇలా అందరు వెండితెరను ఏలినవారే. అయితే అన్నాదురై, కరుణానిధి వరకు వె ండితెర వెనుక నుంచి సేవలు అందించారు. సినీ పరిశ్రమకు సంబంధం లేనివారికి సీఎం పట్టం కట్టడం కామరాజనాడార్‌తోనే చెల్లిపోయింది. ఎంజీఆర్ మరణం తరువాత ఆయన భార్య జానకీ రామచంద్రన్ కొద్దిరోజులు సీఎం పీఠంపై కూర్చున్నా రాణించలేకపోయారు. ఆ తరువాత పార్టీ, ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన జయలలిత పార్టీకి ఏకైక ప్రజాకర్షణ నేతగా మారిపోయారు. సినీ ఆకర్షణే పార్టీలకు గెలుపు మంత్రంగా రుజువైన తరుణంలో ప్రస్తుతం అన్నాడీఎంకే జయ ఆకర్షణను కోల్పోయింది.
వెండితెర రంగుల గుబాళింపులు లేని భారతీయ జనతా పార్టీ ఎన్నో ఏళ్లుగాసూపర్‌స్టార్‌ను రాజకీయ ముగ్గులోకి దింపే ప్రయత్నాలు చేస్తోంది. 1996లో డీఎంకే, తమిళ మానిల పార్టీల కూటమికి రజనీ మద్దతు పలకగా ఆ పార్టీ విజయం సాధించింది. అలాగే 2004లో బీజేపీకి మద్దతు పలికి ఓటు సైతం ఆ పార్టీకే వేసినట్లు ఆయనే ప్రకటించారు. ఆ తరువాత ప్రతి ఎన్నికల్లోనూ తటస్థంగానే ఉంటున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో రజనీ చేత రాజకీయ ప్రవేశం చేయించేందుకు బీజేపీ పడరాని పాట్లు పడింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నైకి వచ్చిన నరేంద్రమోడీ రజనీకాంత్ ఇంటికి వెళ్లారు.
అయితే తమ ఇద్దరి కలయికలో రాజకీయం ఏమీ లేదని, స్నేహపూర్వకంగానే మాట్లాడుకున్నామని రజనీ ప్రకటించారు. అయితే ఆనాటి పరిస్థితులు వేరు, నేడు రాష్ట్ర రాజకీయాల్లో వచ్చిన మార్పులు వేరని రాజకీయ వర్గాల వాదనగా ఉంది. రజనీ రాజకీయ ప్రవేశానికి ప్రస్తుతం అనుకూలమైన వాతావరణం ఉందని భావిస్తున్న బీజేపీ మళ్లీ రజనీని ప్రసన్నం చేసుకునే పనిలో పడిందని తెలుస్తోంది. ఈ మేరకు డిల్లీ స్థాయిలో ప్రయత్నాలు ప్రారంభమయ్యూయనే వార్త ప్రచారంలో ఉంది. అయితే ఎప్పటికప్పుడు దాటవేసే రజనీ ఇటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఎలా స్పందిస్తారోనని అభిమానులు, ప్రజలు ఎదురుచూస్తున్నారు.