సాక్షి, చెన్నై: శీతాకాల సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గవర్నర్ రోశయ్య ఆమోదముద్రతో శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి ఆరంభం కానున్నాయి. ఉదయం పది గంటలకు సెయింట్ జార్జ్ కోటలోని మందిరంలో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఏర్కాడు ఎమ్మెల్యే పెరుమాల్ ఇటీవల మరణిం చిన విషయం తెలిసిందే. ఆయన మృతికి సంతాప సూచకంగా స్పీకర్ ధనపాల్ సంతాప తీర్మానం ప్రవేశపెడతారు. అనంతరం సభ వాయిదా పడతుంది. తర్వాత అసెంబ్లీ వ్యవహారాల కమిటీ సమావేశమవుతుంది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఎలాంటి అంశాలు చర్చించాలి, ప్రతిపక్షాలు ప్రవేశపెట్టనున్న తీర్మానాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. శీతాకాల సమావేశాలు ఐదు రోజులు జరగొచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
మంత్రులతో భేటీ: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి జయలలిత మంత్రులతో సచివాలయంలో మంగళవారం సాయంత్రం సమావేశమయ్యూరు. ముసాయిదా, ప్రత్యేక ప్రకటనలు, తీర్మానాల గురించి చర్చించారు. ఆయా విభాగాల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు తదితర వివరాలు సేకరించారు. కామన్వెల్త్ సమావేశాలను భారత్ బహిష్కరించాలన్న నినాదంతో ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. సమరానికి రెడీ: సభలో ప్రభుత్వాన్ని ఢీకొట్టేందుకు ప్రతి పక్షాలు అస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. ఇసుక దోపిడీ, జాలర్లపై దాడులు, కామన్వెల్త్ సమావేశాలు తదితర అంశాలపై గళం విప్పనున్నాయి. తమ నేతల అక్రమ అరెస్టులు, గూండా చట్టం, జాతీయ భద్రతా చట్టాల ప్రయోగంపై ప్రభుత్వంతో ఢీకొట్టాలని పీఎంకే ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. ఆరు నెలలు సస్పెన్షన్ అనంతరం బుధవారం అసెంబ్లీకి డీఎండీకే సభ్యులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. గతంలో మాదిరిగానే డీఎంకే వాకౌట్ల పర్వం కొనసాగించేనా అనేది వేచి చూడాల్సిందే.
నేటి నుంచి అసెంబ్లీ
Published Wed, Oct 23 2013 2:53 AM | Last Updated on Fri, Sep 1 2017 11:52 PM
Advertisement