శభాష్ శరత్‌కుమార్!
సాక్షి, చెన్నై: సమత్తువ మక్కల్ కట్చి నేత, ఎమ్మెల్యే, నటుడు శరత్‌కుమార్ శభాష్ అనిపించుకున్నారు. అసెంబ్లీలో మూడేళ్ల కాలంలో మూడు వేలకు పైగా ప్రశ్నల్ని సంధించి అందరి దృష్టిలో పడ్డారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టింది. ఈ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తయింది. నాలుగో ఏడాదిలోకి అడుగు పెట్టింది. ఈ కాలంలో బడ్జెట్ సమావేశాలు, ఏడాది ఆరంభంలో తొలి సమావేశం, ప్రత్యేక సమావేశాలు జరిగాయి. ప్రజల చేత ఎన్నుకోబడ్డ 234 మంది సభ్యుల పనితీరు అసెంబ్లీలో ఏ మేరకు ఉన్నదో అన్న వివరాల్ని ఓ తమిళ మీడియా సేకరించింది.
మెజారిటీ శాతం మంది సభ్యులు ప్రజా సమస్యలు తమ గిట్టనట్టుగా వ్యవహరించి ఉండటం గమనించాల్సిన విషయం. ప్రతి పక్షాలు అయితే, వాకౌట్లతో కాలయాపన చేశాయే గానీ, గంటల తరబడి సభలో కూర్చున సందర్భమే లేదు. ఈ పరిస్థితుల్లో సమత్తువ మక్కల్ కట్చి నేత, నటుడు, ఎమ్మెల్యే శరత్‌కుమార్ అందరి దృష్టిలో పడ్డారు. ఇందుకు కారణం సభకు ఆయన 46 శాతం రోజులు వచ్చినా, 3,288 ప్రశ్నలను సంధించడం విశేషం. అలాగే, అదేపార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎర్నావూర్ నారాయణన్ 1744 ప్రశ్నలను లేవదీసి ఉన్నారు. శరత్‌కుమార్ సంధించిన ప్రశ్నల్లో 679 ప్రశ్నలకు స్టార్ హోదా కల్పించి ఉన్నారు. ఇక సభలో అత్యధిక సమయం నిలుచుని ప్రసంగం చేసిన వారిలో సీఎం జయలలిత ముందు వరుసలో ఉన్నారు.
ఆమె ప్రతి రోజూ ప్రత్యేక ప్రకటనల్ని అసెంబ్లీలో ప్రకటించడం గమనార్హం. ఇక సభకు వంద శాతం మేరకు హాజరు అయిన వారిలో కేవలం 38 మంది మాత్రమే ఉన్నారు. వీరంతా అన్నాడీఎంకే సభ్యులే. ప్రతి పక్ష సభ్యులు సభలో కన్నా, లాబీల్లో ఎక్కువ సమయం గడిపి ఉన్నారు. డీఎంకే అధినేత ఎం.కరుణానిధి కేవలం మూడు శాతం రోజులు మాత్రమే సభకు చుట్టుపు చూపుగా వచ్చి వెళ్లారు. ఆయన వీల్ చైర్‌కు స్థలం కేటాయించేందుకు ప్రభుత్వం నిరాకరించ బట్టే, సమావేశాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ప్రధాన ప్రతి పక్ష నేత విజయకాంత్ కూడా అదే బాటలోనే ఉన్నారు. ఆయన 14 శాతం రోజులే సభలో అడుగుపెట్టారు.