అసెంబ్లీకి ‘పంచెకట్టు’
సాక్షి, చెన్నై: పంచెకట్టుకు ఎదురైన పరాభావం సోమవారం అసెంబ్లీని తాకింది. క్రికెట్ క్లబ్ నిర్వాకంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. క్లబ్‌పై చర్య తీసుకోవాలని పట్టుబట్టాయి. న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యా శాఖ మంత్రి కేసీ వీరమణి సభకు హామీ ఇచ్చారు. తమిళ సంప్రదాయ వస్త్రధారణ పంచెకట్టుకు వ్యతిరేకంగా చెన్నై క్రికెట్ క్లబ్ వ్యవహరించిన తీరు గురించి తెలిసిందే. ఈ వ్యవహారంపై తమిళాభిమాన సంఘాలు, రాజకీయ పార్టీలుతీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆ క్లబ్‌పై చర్యకు డిమాండ్ చేస్తూ ఆందోళనలు మొదలయ్యూయి. ఈ పరిస్థితుల్లో పంచెకట్టుకు ఎదురైన పరాభావం సోమవారం ఉదయం అసెంబ్లీని తాకింది. ఉదయం ప్రశ్నోత్తరాల అనంతరం ఈ వ్యవహారంపై చర్చకు ప్రత్యేక తీర్మానానికి ప్రతి పక్షాలు ప్రవేశ పెట్టారుు. ఇందుకు స్పీకర్ ధనపాల్ అనుమతి ఇవ్వడంతో అన్ని రాజకీయ పక్షాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రసంగించారు.
చర్యకు పట్టు : డీఎంకే శాసన సభా పక్ష నేత ఎంకే స్టాలిన్ ప్రసంగిస్తూ, క్లబ్ నిర్వాకాన్ని తీవ్రంగా ఖండించారు. ఆంగ్లేయులు దేశం విడిచి వెళ్లినా, వారి సంస్కృతి, వారు పెట్టిన ఆంక్షలు, నిబంధనలు ఇంకా అనేక క్లబ్‌లు అనుసరించడం సిగ్గు చేటుగా పేర్కొన్నారు. క్రికెట్ క్లబ్, జింకాన క్లబ్‌తో పాటుగా కొన్ని స్టార్ హోటళ్ల తీరు తమిళ సంస్కృతి సంప్రదాయాలకు భంగం కలిగేలా ఉన్నాయని ధ్వజమెత్తారు. డీఎండీకే ఎమ్మెల్యే చంద్రకుమార్ ప్రసంగిస్తూ, పంచెకట్టుకు వ్యతిరేకంగా వ్యవహరించడం తమిళుల మనోభావాల్ని కించ పరచడమేనని పేర్కొన్నారు. సీపీఎం ఎమ్మెల్యే సౌందరరాజన్ ప్రసంగిస్తూ, క్లబ్‌లు, హోటళ్లలో ఉన్న ఆంక్షల్ని ఎత్తి వేసే విధంగా ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ ఎమ్మెల్యే ఆర్ముగం ప్రసంగిస్తూ, పంచెకట్టుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కొన్ని సంస్థలు, మున్ముందు రోజుల్లో తమిళ సంప్రదాయాన్ని, సంస్కృతిని పూర్తిగా విచ్ఛిన్నం చేయడం ఖాయం అని హెచ్చరించారు.
కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత గోపినాథ్ ప్రసంగిస్తూ, దివంగత నేతలు అన్నా, కామరాజర్ పంచెకట్టుతోనే ఢిల్లీకి వెళ్లారని, పార్లమెంట్‌లో సైతం పంచెకట్టుతో హాజరయ్యే తమిళ నేతలు నేటికీ ఉన్నారని వివరించారు. పార్లమెంట్‌లోనే పంచెకట్టుకు అనుమతి ఉన్నప్పుడు, ఈ క్లబ్‌ల్లో ఆంక్షలేమిటో అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్వర్డ్ బ్లాక్ ఎమ్మెల్యే కదిరవన్, పీఎంకే ఎమ్మెల్యే గణేష్‌కుమార్, ఎంఎంకే ఎమ్మెల్యే అస్లాం బాషా, ఎస్‌ఎంకే ఎమ్మెల్యే నారాయణ తమ ప్రసంగాల్లో ఆ క్లబ్ నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ క్లబ్‌పై కేసులు నమోదు చేయాలని, పంచెకట్టును అవమానించిన వారందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయ నిపుణులతో చర్చ: ప్రతి పక్షాల పట్టుకు అధికార పక్షం దిగి వచ్చింది. పాఠశాల విద్యా శాఖ మంత్రి కేసీ వీరమణి ప్రతి పక్షాల వినతిని పరిగణనలోకి తీసుకుని సభకు హామీ ఇచ్చారు. ఆ క్లబ్ నిర్వాకంపై పరిశీలన జరుపుతున్నామన్నారు. న్యాయ నిపుణులతో చర్చించినానంతరం, సీఎం జయలలిత దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.