అందరి సహకారంతో పార్టీ బలోపేతం
బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు యడ్యూరప్ప
బెంగళూరు: భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖకు సంబంధించిన ఏ విషయమైన పార్టీ పధాదికారులతో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటానని ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప తెలిపారు. ఏ విషయం పైన కూడా తానొక్కడినే నిర్ణయం తీసుకోబోనని ఆయన స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం బీజేపీ పార్టీ నగరంలోని ప్యాలెస్ మైదానంలో ‘సామరస్య-సమావేశం’ పేరుతో నిర్వహించిన కార్యకర్తల బృహత్ సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయకులను ఏకతాటిపై నడిపించి కర్ణాటకలో తిరిగి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని తనకు ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా దిశానిర్దేశం చేశారన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పై కఠినచర్యలకు వెనుకాడబోనని యడ్యూరప్ప స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 224 నియోజక వర్గాల పరిధిలో పార్టీ పటిష్టత కోసం క్షేత్రస్థాయి మార్పులు అవసరమన్నారు. మహిళ, దళిత, రైతు, యువ మోర్చా విభాగాలను బలోపేతం చేయనున్నానని తెలిపారు. ఇందుకోసం వారంలో మూడు నుంచి నాలుగు రోజులు రాష్ట్ర పర్యటనలో ఉండి ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటానని తెలిపారు.గతంలో బీజేపీలో ఉండి, ఆ తర్వాత పార్టీని వీడిన వారు ఎవరైనా సరే బీజేపీలోకి వస్తే తాము చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని యడ్యూరప్ప ప్రకటించారు.
నెలలోపు అవినీతి చిట్టా బయటికి తీస్తా
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వ ఆస్పత్రుల్లో ల్యాబ్‌లను ఏర్పాటు చేసే విషయమై ఆయన కుమారుడు డెరైక్టర్‌గా ఉన్న సంస్థకు టెండర్‌లను దక్కేలా చేశారని విమర్శించారు. సిద్ధరామయ్య ప్రభుతంలో జరిగిన ఇలాంటి అక్రమాలన్నింటిని నెలలోపు ప్రజల ముందుకు తీసుకు వస్తానన్నారు. రాష్ట్రంలో 1,200 మంది రైతులు అత్మహత్యలకు పాల్పడితే కేవలం 340 నుంచి 350 మందికి మాత్రమే పరిహారం అందిందన్నారు. మిగిలిన వారికి బీజేపీ తరపున ఒకలక్ష నుంచి రెండు లక్షరుపాలయ పరిహారం అందించాల్సిన విషయమై వేదిక పై ఉన్న నాయకులే కాకుండా ప్రతి కార్యకర్త ఆలోచించాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో కరువు నివారణ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1550 కోట్ల నిధులు విడుల చేసినా వాటిని వినియోగించుకోవడంలో సిద్ధరామయ్య ప్రభుత్వం నిర్లక్ష్యధోరణి వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి అనంత్‌కుమార్‌తో పాటు బీజేపీ నేతలు శ్రీరాములు, సురేష్‌కుమార్, ప్రహ్లాద్‌జోషి, శోభాకరంద్లాజే, ఆర్.అశోక్ తదితరులు పాల్గొన్నారు. కాగా, మరో కేంద్ర మంత్రి సదానంద గౌడ గైర్హాజరు కావడం గమనార్హం. ఇదిలా ఉండగా ఇక ఈ వేదికను యడ్యూరప్ప తన బలప్రదర్శనకు వినియోగించుకున్నారు. అనుచరులుగా ఉంటూ తాను పార్టీని వీడిన సమయంలో బీజేపీ నుంచి బయటికి వచ్చేసిన వారిని తిరిగి పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా బీజేపీకి తన అవసరం ఎంత ఉందన్న విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాక ఈ సమావేశానికి వేలాది సంఖ్యలో కార్యకర్తలను సమీకరించడం ద్వారా తను మాస్ లీడర్‌నని మరోసారి చాటిచెప్పే ప్రయత్నం చేశారు.