అవాంఛనీయ ఘటనలు జరిగితే యడ్డీదే బాధ్యత
హెచ్చరించిన సీఎం సిద్ధరామయ్య
బెంగళూరు(బనశంకరి): తీవ్ర వ్యతిరేకత మధ్య టిప్పు జయంతి ఆచరణకు ప్రభుత్వం సన్నద్ధమైంది. గురువారం నిర్వహించే టిప్పు జయంతి సందర్భంగా ఎక్కడైనా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, భజరంగదళ్ కార్యకర్తలు ఇబ్బందులు సృష్టిస్తే నిర్ధాక్షిణ్యంగా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సీఎం సిద్ధరామయ్య హెచ్చరించారు. సీఎం నివాస కార్యాలయం కృష్ణాలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ, భజరంగదళ్ సంఘాలు సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కుటిల ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. టిప్పు జయంతి సందర్భంగా శాంతిభద్రతలకు అడ్డుతగిలిన వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనుకాడదని సీఎం స్పష్టం చేశారు.
బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీఎస్.యడ్యూరప్ప నీతినియమాలు వదిలేశారని విమర్శించారు. ఆయన కేజీపీలో ఉండగా టిప్పుసుల్తాన్‌ను శ్లాఘించారన్నారు. బీజేపీలోకి వచ్చిన అనంతరం టిప్పును వ్యతిరేకిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుతం రాజకీయం చేయడానికి టిప్పు జయంతిని యడ్యూరప్ప వినియోగించుకుంటున్నారని ఆరోపించారు.
టిప్పు జయంతి సందర్భంగా శాంతిభద్రతలకు భంగం వాటిల్లితే యడ్యూరప్పదే బాధ్యత అని సిద్ధరామయ్య హెచ్చరించారు. విపక్షనేత జగదీశ్ షెట్టర్, ఉప నేత ఆర్.అశోక్‌లు టిప్పు ధరించిన టోపీ పెట్టుకొని ఫోజులు ఇచ్చిన విషయాన్ని ప్రజలు మరచిపోలేదన్నారు. టిప్పు జయంతి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం ఇవ్వకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఎం చెప్పారు.