Tipu Jayanti
-
టిప్పు జయంతి వేడుకలు.. హై టెన్షన్
సాక్షి, బెంగళూర్ : టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు కన్నడనాట చిచ్చును రాజేస్తున్నాయి. బీజేపీ, హిందూ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. అయితే కొన్ని చోట్ల అవి హింసాత్మకంగా మారాయి. ఉదయం కొడగు జిల్లా మడికరి ప్రాంతంలో ఓ ఆర్టీసీ బస్సుపై రాళ్లు రువ్విన ఆందోళన కారులు.. దానిని పాక్షికంగా ధ్వంసం చేశారు. మరికొన్ని చోట్ల అల్లర్లకు పాల్పడేందుకు ప్రయత్నించిన వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, సమస్యాత్మక ప్రాంతాలైన మైసూర్, కొడగు, ఉడిపిలో గత రెండు రోజులుగా నిఘా వేసిన పోలీసులు.. ఈ ఉదయం నుంచే భారీ ఎత్తున్న మోహరించారు. మొత్తానికి తీవ్ర ఉద్రిక్తత, భారీ భద్రత నడుమే సిద్ధరామయ్య ప్రభుత్వం టిప్పు జయంతి వేడుకలను నిర్వహిస్తోంది. ప్రభుత్వం విజ్ఞప్తి మేరకే తాము వేడుకలకు భద్రత కల్పించామని.. ఇందులో ఎలాంటి పక్షపాత ధోరణి లేదని బెంగళూర్ పోలీస్ కమీషనర్ టి సునీల్ కుమార్ తెలిపారు. 25 ఫ్లాటూన్ దళాలు, కర్ణాటక రిజర్వ్డ్ పోలీసులు అంతా కలిపి 11,000 మందితో భద్రతను నగరంలో మోహరించినట్లు ఆయన చెప్పారు. వివాదం.. కాగా, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల క్రితం నుంచి టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించటం మొదలుపెట్టింది. అయితే బీజేపీతోపాటు పలు హిందూ అనుబంధ సంఘాలు, కోదావా తెగకు చెందిన కొందరు సభ్యులు టిప్పు జయంతి వేడుకలను ఖండిస్తూ వస్తున్నాయి. వీరికి ఇప్పుడు కనరా క్రిస్టియన్లు మద్దతు ప్రకటించటం గమనార్హం. కాగా, 2015 వేడుకల్లో కొడగు జిల్లాలో చెలరేగిన ఘర్షణల్లో ఇద్దరు చనిపోయారు కూడా. టిప్పు సుల్తాన్ హిందువులను ఊచకోత కోయించాడని.. అలాంటి వ్యక్తి పేరిట వేడుకలను ప్రభుత్వం నిర్వహించటం దారుణమని పలువురు ఖండిస్తూ వస్తున్నారు. వీరిలో కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే కూడా ఉన్నారు. ఈ మధ్యే టిప్పు జయంతి వేడుకల పై స్టే విధించాలన్న పలువురి అభ్యర్థనను కర్ణాటక హైకోర్టు తోసిపుచ్చింది. -
కౌన్సెలింగ్‌తో పాటు కటింగ్ !
బొమ్మనహళ్లి (కల్బుర్గి) : కల్బుర్గి జిల్లాతో పాటు తాలూకా పరిధి పీఎస్‌లలో ఉన్న రౌడీషీటర్లకు పోలీసులు పరేడ్ నిర్వహించి హెయిర్ కటింగ్ చేయించిన ఘటన ఆదివారం జరిగింది. త్వరలో జరుగనున్న టిప్పు జయంతి సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా రౌడీషీటర్లను పిలిపించి కౌన్సెలింగ్‌తో పాటు అతిగా జట్టు పెంచుకున్న వారికి కటింగ్ కూడా చేయించారు. నేరప్రవృత్తికి దూరంగా ఉండాలని, ఒకేరోజు 900 మందికి కటింగ్ చేయించి హెచ్చరించినట్లు ఎస్పీ శశికుమార్ తెలిపారు. -
టిప్పు జయంతికి సర్వం సిద్ధం
అవాంఛనీయ ఘటనలు జరిగితే యడ్డీదే బాధ్యత హెచ్చరించిన సీఎం సిద్ధరామయ్య బెంగళూరు(బనశంకరి): తీవ్ర వ్యతిరేకత మధ్య టిప్పు జయంతి ఆచరణకు ప్రభుత్వం సన్నద్ధమైంది. గురువారం నిర్వహించే టిప్పు జయంతి సందర్భంగా ఎక్కడైనా బీజేపీ, ఆర్ఎస్ఎస్, భజరంగదళ్ కార్యకర్తలు ఇబ్బందులు సృష్టిస్తే నిర్ధాక్షిణ్యంగా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సీఎం సిద్ధరామయ్య హెచ్చరించారు. సీఎం నివాస కార్యాలయం కృష్ణాలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ, భజరంగదళ్ సంఘాలు సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కుటిల ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. టిప్పు జయంతి సందర్భంగా శాంతిభద్రతలకు అడ్డుతగిలిన వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనుకాడదని సీఎం స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీఎస్.యడ్యూరప్ప నీతినియమాలు వదిలేశారని విమర్శించారు. ఆయన కేజీపీలో ఉండగా టిప్పుసుల్తాన్ను శ్లాఘించారన్నారు. బీజేపీలోకి వచ్చిన అనంతరం టిప్పును వ్యతిరేకిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుతం రాజకీయం చేయడానికి టిప్పు జయంతిని యడ్యూరప్ప వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. టిప్పు జయంతి సందర్భంగా శాంతిభద్రతలకు భంగం వాటిల్లితే యడ్యూరప్పదే బాధ్యత అని సిద్ధరామయ్య హెచ్చరించారు. విపక్షనేత జగదీశ్ షెట్టర్, ఉప నేత ఆర్.అశోక్‌లు టిప్పు ధరించిన టోపీ పెట్టుకొని ఫోజులు ఇచ్చిన విషయాన్ని ప్రజలు మరచిపోలేదన్నారు. టిప్పు జయంతి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం ఇవ్వకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఎం చెప్పారు. -
టిప్పు స్వాతంత్ర్య యోధుడు కాడు: హైకోర్టు
-టిప్పు జయంతిని ఎందుకు నిర్వహించాలి? -ప్రభుత్వానికి హైకోర్టు సూటిప్రశ్న బెంగళూరు: ’టిప్పు సుల్తాన్ జయంతి నిర్వహణతో ప్రభుత్వం పలు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోంది. అందువల్ల ఈ జయంతిని ఎందుకు నిర్వహించాలి’ అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.కే ముఖర్జీ ప్రభుత్వాన్ని బుధవారం సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వం టిప్పుసుల్తాన్ జయంతిని నిర్వహిచడం సరికాదని పేర్కొంటూ నగరానికి చెందిన సామాజికవేత్త మంజునాథ్ రాష్ట్ర హైకోర్టులో ప్రజాహిత వాజ్యాన్ని వేశారు. కేసు విచారణలో భాగంగా ఎస్.కే ముఖర్జీ...’టిప్పు సుల్తాన్ ఓ రాజ్యానికి రాజు మాత్రమే. నిజాంలపై ఆంగ్లేయులు దండెత్తినప్పుడు తన రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం మాత్రమే నిజాంలకు మద్దతు ఇచ్చారు. అందువల్ల టిప్పు సుల్తాన్ స్వతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వ్యక్తిగా ఎలా చెబుతారు?. అసలు టిప్పు సుల్తాన్ జయంతి ఉద్దేశం ఏమిటీ?’ అని ప్రశ్నిస్తూ విచారణను నేటి (గురువారం)కి వాయిదా వేశారు. -
టిప్పు జయంతి నిర్వహించొద్దు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప బెంగళూరు: ఎట్టి పరిస్థితుల్లోనూ టిప్పు జయంతిని ప్రభుత్వం నిర్వహించకూడదని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందుకు విరుద్ధంగా జరిగితే పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా వీధి పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన కన్నడ రాజ్యోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం మొండిగా టిప్పు జయంతిని నిర్వహించాలని భావించడం సరికాదన్నారు. దీని వల్ల శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కన్నడ మాత భువనేశ్వరీదేవి విగ్రహాన్ని పూర్తి చేస్తామన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భువనేశ్వరీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం రూ.25 కోట్లను బడ్జెట్లో కేటారుుంచినట్లు ఈ సందర్భంగా గుర్తుచేశారు. కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్ మాట్లాడుతూ... నదీ జలాల విషయంలో సిద్ధరామయ్య రాజకీయాలు చేయడం తగదన్నారు. కావేరి, మహదారుు విషయంలో కేంద్రానిదే బాధ్యత అన్నట్లు భ్రమలు కల్పించే ప్రయత్నం మానుకోవాలన్నారు. శాంతిభద్రతల అదుపు చేయడంలో కూడా సిద్ధరామయ్య విఫలమయ్యారన్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్త రుద్రేశ్ హత్య విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా సిద్ధు ప్రభుత్వం వ్యవహరిస్తోందని అనంతకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.