బీజేపీలో ముదిరిన ఆధిపత్యపోరు
కేఎస్ గీ బీఎస్‌వై
‘సంగొళ్లిరాయణ్ణ బిగ్రేడియర్’ ఏర్పాటుపై యడ్డి గరంగరం
వచ్చేనెల 26న ‘హింద’ సమావేశాలు
బెంగళూరు : భారతీయ జనతా పార్టీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప, ఆ పార్టీ సీనియర్‌నేత కే.ఎస్ ఈశ్వరప్ప మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో యడ్డీ వద్దంటున్నా కే.ఎస్ ఈశ్వరప్ప ‘సంగొళ్లిరాయణ్ణ బ్రిగేడియర్’ పేరుతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. యడ్యూరప్ప బీజేపీ రాష్ట్రాధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దాదాపు నెలరోజులకు పార్టీ వివిధ విభాగాలకు అధ్యక్షులను, పార్టీ జిల్లా ఇన్ చార్జులను నియమించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆ పార్టీలోని కొంతమంది సీనియర్ నాయకులకు, యడ్యూరప్పకు మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. ముఖ్యంగా కే.ఎస్‌ఈశ్వరప్ప తన వర్గీలకు పదవుల కేటాయింపులో అన్యాయం జరిగిందని గుర్రుగా ఉన్నారు. అప్పటి నుంచి అడపాదడపా యడ్యూరప్పకు వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే యడ్యూరప్ప సూచనలను లెక్కచేయకుండా సామాజికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసమంటూ ‘హింద’ సమావేశాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
అందులో భాగంగా సంగొళ్లిరాయణ్ణ బ్రిగేడియర్ పేరుతో ప్రత్యేక సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ సంఘం ఆధ్వర్యంలో హింద కార్యక్రమాలు, సభలు, సమావేశాలు ఏర్పాటు చేయలని గురువారం నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ బ్రిగేడియర్ సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయించడమే కాకుండా ప్రత్యేక పతాకానికి కూడా తుది రూపును ఇచ్చారు. ఈ పతాకంలో పసుపుపచ్చని వస్త్రం పై కత్తి, డాలు పట్టుకుని ఉన్న క్రాంతి వీర సంగోళ్లి రాయణ్ణ చిత్రం ముద్రించబడి ఉంటుంది. ఇక వచ్చేనెల 26న మావేరిలో హింద బృహత్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఇక వైపున యడ్యూరప్ప ఏ సమావేశమైనా బీజేపీ ఆధ్వర్యంలోనే జరగాలని పట్టుబడుతుండగా కే.ఎస్ ఈశ్వరప్ప మాత్రం కాంత్రివీర సంగొళ్లి రాయణ్ణ బ్రిగేడ్ ఆధ్వర్యంలో ‘హింద’ సమావేశాలను నిర్వహించడానికి సమాయత్తం కావడం కమల వర్గంలోనే కాక రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
బీజేపీ హయాంలో రామరాజ్యం సాధ్యమయ్యిందా?!
సంగొళ్లిరాయణ్ణ బ్రిగేడియర్ సంఘం రూపకల్పన అనంతరం కే.ఎస్ ఈశ్వరప్ప తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. బీజేపీ హయాంలో రామరాజ్యం వచ్చిందా? లేదు కదా? అటు వంటి రాజ్యం కోసం తనవంతు కృషి చేస్తున్నానన్నారు. అందువల్లే సంగొళ్లిరాయణ్ణ బ్రిగేడియర్ ఏర్పాటైందన్నారు. ఇందులో తాను సభ్యుడిని కాదని అయితే ‘బ్రిగేడియర్’ సభ్యులు పిలస్తే రూపకల్పనలో పాలుపంచుకున్నానన్నారు.
బీజేపీలో యువమోర్చా, రైతుమోర్చ తదితర విభాగాలు ఉన్నమాట వాస్తవమే అయినా వారి వల్లే పార్టీ అధికారంలోకి రావడం సాధ్యం కాదన్నారు. ఆ విభాగాల్లో సభ్యులు కాని వేలమంది ఉదాహరణకు ఐఏఎస్, ఐపీఎస్‌లు సంగొళ్లిరాయణ్ణ బ్రిగేడియర్‌లో సభ్యులుగా ఉన్నారన్నారు. వారి వల్ల పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి తన వ ంతు ప్రయత్నం చేస్తున్నానన్నారు. తనకు పార్టీ పెద్దల మద్దతు కూడా ఉందన్నారు.