
ముద్దుపెట్టి పరారైన పోకిరీ
బనశంకరి: భారత ఐటీ రాజధానిలో పోకిరీలు రెచ్చిపోతున్నారు. అమ్మాయిలు కనిపిస్తే ఆగడాలకు పాల్పడుతున్నారు. బస్టాండు వద్ద క్యాబ్ కోసం వేచిచూస్తున్న యువతికి ఒక ఆగంతకుడు ముద్దు పెట్టి పరారయ్యాడు. ఈ ఘటనతో బాధితురాలు కంగుతినింది.
ఈ ఘటన బెంగళూరు జీవనబీమానగర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఉత్తర భారతదేశానికి చెందిన ఓ యువతి నగరంలో ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది. శనివారం రాత్రి తన స్నేహితుల ఇంట్లో పార్టీ ముగించుకుని ఇంటికి బయలుదేరింది. ఆదివారం తెల్లవారుజామున 2.30 సమయంలో జీవనబీమానగర బస్టాండు వద్ద క్యాబ్ కోసం వేచిచూస్తోంది. ఇంతలో ఒక వ్యక్తి ఆమె దగ్గరగా వెళ్లి యువతి చెంపపై ముద్దుపెట్టి ఉడాయించాడు. దీంతో భయాందోళనకు గురైన యువతి స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ఘటనాస్ధలంలో ఉన్న సీసీ టీవీ కెమెరా చిత్రాలను పరిశీలించి పోకిరీ కోసం వెతుకుతున్నారు.