ఐదో పెళ్లికి సిద్ధమైన మహిళ
సాక్షి, చెన్నై : మాటల మత్తులో పడేసి, పెళ్లి చేసుకోవడంతో పాటుగా కొన్నాళ్లకు అందిన కాడికి దోచేసి బురిడీ కొట్టించే మాయ లేడీ ఉదంతం ఇది. నలుగురిని పెళ్లి చేసుకుని మోసగించడంతో పాటుగా ఐదో పెళ్లికి సిద్ధ పడ్డ ఈ పెళ్లిళ్ల రాణి కటకటాల పాలైంది. సభానా, లక్ష్మి తదితర పేర్లతో నాలుగు కాసులున్న యువతకు వల వేసి పెళ్లి గాలంతో చేతికి అందింది దోచుకున్న యువతి బండారం గతంలో వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మరో మాయ లేడీ ఉదంతం వెలుగులోకి వచ్చింది. మొగపేర్ ఈస్ట్ టీవీఎస్ అవెన్యూకు చెందిన శ్రీనివాసన్(38) శుభకార్యాలకు, అలంకరణలు చేయించే కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. పెళ్లి కాని శ్రీనివాసన్ వధువు కోసం అన్వేషణలో పడ్డాడు. గత ఏడాది చివర్లో ఓ వెబ్ సైట్‌లో పెళ్లి ప్రకటనలో ఉన్న వివరాల మేరకు కోయంబత్తూరుకు చెందిన గాయత్రికి ఫోన్ కొట్టాడు. తాను బీఎస్సీ చదువుకున్నట్టు, తన ఇష్టాయిష్టాలను గాయత్రి చెప్పడం శ్రీనివాసన్‌కు నచ్చింది.
ఇంకే ముంది, ఇటీవలే ఆ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న నెలన్నరకు గాయత్రిలో మార్పులు వస్తుండడంతో రహస్యంగా ఆమె ఫోన్‌లోని నెంబర్లను సేకరించాడు. కొన్ని నెంబర్ల ద్వారా లభించిన సమాచారంతో షాక్‌కు గురి అయ్యాడు. తన వద్ద ఉన్న వివరాలు, సమాచారాల మేరకు తిరుమంగళం మహిళా పోలీసులను శ్రీనివాసన్ ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన మిహ ళా పోలీసులు బుధవారం రాత్రి గాయత్రిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో ఈ మాయ లేడి బండారం అంతా వెలుగులోకి వచ్చింది. కేవలం డబ్బు, ఆభరణాల మీదున్న మోజుతో భర్తల్ని మార్చేసినట్లు తేలింది. 2010లో టి నగర్‌కు చెందిన నరసింహారావును పెళ్లి చేసుకుని, అక్కడి నుంచి ఉడాయించినట్టు తేలింది.
2012లో తిరుచ్చిలో రవికుమార్‌ను వివాహం చేసుకుని అతడికి విడాకులు ఇవ్వడంతో పాటుగా 2013లో చెన్నై మాంబళంకు చెందిన రాజగోపాల్‌ను మనువాడి, అతడి వద్ద అందింది దోచుకుంది. తన వలలో శ్రీనివాసన్ పడటం, అతడిని బెదిరించడం మొదలెట్టడంతో పాటుగా అంబత్తూరుకు చెందిన బాలాజీతో వివాహానికి రెడీ అయింది. ముందుగానే మేల్కొన్న శ్రీనివాసన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పెళ్లిళ్ల రాణి కటకటాలపాలైంది. అంబత్తూరు బాలాజీ ఈ మాయ లేడీ మాయ నుంచి తప్పించుకున్నట్టు అయింది. వాక్ చాతుర్యం, ఫోన్లలోనే గమ్మత్తయిన మాటలు చెప్పి తన వలలో పడేలా గాయత్రి చేసుకున్నట్టు శ్రీనివాసన్ పేర్కొన్నారు. తరచూ తన పేర్లను మార్చుకుని మరీ వివాహాలకు ఈ మాయ లేడీ సిద్ధ పడుతున్నట్టుగా విచారణలో తేలింది.