లక్ష్మీ తరహాలో చైనాలోని ఓ బ్యాంకింగ్ రోబో
చెన్నై: కొద్ది గంటలుగా దేశం మొత్తం బ్యాంకుల చుట్టూ తిరుగుతోంది. ఇంకొన్ని రోజులపాటు ఈ పాట్లు తప్పవు. రెండుమూడు వారాల తర్వాతగానీ సాధారణ పరిస్థితులు నెలకొనవని ప్రభుత్వాలే ప్రకటిస్తున్నాయి. సరిగ్గా ఇదేసమయంలో దేశీయ బ్యాంకింగ్ రంగంలో లక్ష్మీ సంచలనం మొదలైంది. బ్రహ్మపదార్థం లాంటి బ్యాంక్ వ్యవహారాలను సులువుగా ఖాతాదారులకు వివరించడంతోపాటు అకౌంట్ విరాలు, హోమ్, పర్సనల్ లోన్ తదితర అంశాల గురించి పూసగుచ్చినట్లు చెబుతుంది లక్ష్మి. అకౌంట్ లో పెద్దగా డబ్బుల్లేని, పక్కనే గర్ల్ ఫ్రెండ్ ఉండే సందర్భాల్లో మీ పరువును కాపాడుతుంది. ఎలాగంటే..
దేశంలోనే మొట్టమొదటి బ్యాంకింగ్ రోబో లక్ష్మి సేవలు గురువారం లాంఛనంగా ప్రారంభం అయ్యాయి. సిటీ యూనియన్ బ్యాంక్ టీ.నగర్ శాఖ(చెన్నై)లో దీనిని ఏర్పాటుచేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో నడుచుకునే ఈ రోబో ఖాతాదారులకు అవసరమైన 125 రకాల సేవలను అందిస్తుంది. స్వచ్ఛమైన సాధారణ ఇంగ్లీషులో స్పందిస్తూ సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో సమాధానాలు చెబుతుంది. కోరిన పక్షంలో తన స్క్రీన్ పై అకౌంట్ వివరాలను చూపెడుతుంది. లక్ష్మీ.. దేశంలోనే మొట్టమొదటి బ్యాంకింగ్ రోబో అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేస్తూ ఎప్పటికప్పుడు తనను తాను అప్ డేట్ చేసుకుంటుందని, ఏడాది చివరికల్లా ఈ తరహా సేవలు మరో పాతిక బ్యాంకుల్లో ప్రారంభిస్తామని సిటీ యూనియన్ బ్యాంక్ ప్రతినిధులు మీడియాకు చెప్పారు.
అతి త్వరలోనే లక్ష్మీ కస్టమర్లతో తమిళంలోనూ మాట్లాడుతుందని, తద్వారా సేవలు మరింత చేరువ అవుతాయని బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు. ఒకవేళ జవాబు తెలియకుంటే వెంటనే బ్యాంక్ మేనేజర్ కు సమాచారం అందిస్తుందని, కస్టమర్లు అడిగే ప్రశ్నలను బట్టి లక్ష్మీ తన తెలివితేటలను పెంచుకుంటుందని చెప్పారు. మరోవైపు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ డీఎఫ్ సీ సైతం ఇదే తరహా బ్యాంకింగ్ రోబోలను ప్రవేశపెట్టాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ సంచలనాల సంగతి ఎలా ఉన్నా బ్యాంకు సర్వీసులు త్వరిత గతిన అందితే అంతకన్నా కస్టమర్లకు కావాల్సింది ఏముంటుంది!