
'నటి అల్ఫోన్సా నా భర్తను కిడ్నాప్ చేసింది'
చెన్నై : నటి అల్ఫోన్సా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అల్ఫోన్సా తన భర్తను అపహరించిందంటూ మైలాడుదురైకు చెందిన సుజాత అనే ఓ మహిళ (అసలుపేరు కాదు) పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె బుధవారం నగర పోలీసు కమిషనర్ జార్జ్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. పలు భాషల్లో శృంగార తారగాను, వివిధ పాత్రల్లోనూ నటించిన అల్ఫోన్సా ...రజనీకాంత్ నటించిన భాషా చిత్రంలో రా...రా..రా.. రామయ్య పాట ద్వారా ప్రాచుర్యం పొందారు.
కాగా తన భర్తను కిడ్నాప్ చేసిందంటూ అల్ఫోన్సాపై ఫిర్యాదు చేయడం కలకలం సృష్టిస్తోంది. చెన్నై సైదాపేటలో నివసిస్తున్న తన భర్త జయశంకర్‌ను అల్ఫోన్సా అపహరించిందని, ప్రస్తుతం ఆమె తనను ఫోన్లో చంపుతానని బెదిరిస్తోందని సుజాత తన ఫిర్యాదులో తెలిపింది. ఎనిమిదేళ్లుగా తాను జయశంకర్ ప్రేమించుకుని 2013లో పెళ్లి చేసుకున్నట్లు ఆమె వెల్లడించింది. 'అలాంటిది అల్ఫోన్సా ఫోన్‌లో నీకంటే ముందే జయశంకర్‌ను నేను పెళ్లి చేసుకున్నాను. కాబట్టి నువ్వు అతన్ని వదలి పారిపోలేదంటే చంపుతానంటూ బెదిరిస్తోందని' తెలిపింది.
సుజాత తన ఫిర్యాదుతో పాటు కొన్ని ఆధారాలను పోలీస్ కమిషనర్‌కు అందించింది. అందులో అల్ఫోన్సా, జయశంకర్ సన్నిహితంగా ఆడిపాడే సన్నివేశాలు వీడియోతోపాటు తన పెళ్లి ఫోటోలు ఉన్నాయి. సుజాత ఫిర్యాదును స్వీకరించిన కమిషనర్ జార్జ్ దర్యాప్తుకు ఆదేశించారు. అడయారు అసిస్టెంట్ కమిషనర్, కన్నన్ ఆధ్వర్యంలో సైదాపేట పోలీసులు ఈ కేసుపై విచారణ నిర్వహిస్తున్నారు.