మాకెందుకీ శాపం..
మాకెందుకీ శాపం..
Published Thu, Oct 20 2016 4:03 PM | Last Updated on Mon, Sep 4 2017 5:48 PM
పై ఫొటొలో దీనంగా కనిపిస్తున్న మహిళ పేరు గొర్రె రజిత. ఆ పక్కన పిల్లలు ఆమె కుమారులు యశ్వంత్, సన్నీ. వీరిది పరకాల మండలం చౌటుపర్తి. పిల్లలతో కలిసి ఈమె బుధవారం హన్మకొండలోని రూరల్ జిల్లా కలెక్టరేట్‌కు వచ్చింది. ఆ సమయంలో కలెక్టర్ జీవన్ ప్రశాంత్ పాటిల్ మిషన్ భగీరథ పనులను పరిశీలించేందుకు శాయంపేట వెళ్లారు. దీంతో కలెక్టరేట్ ఆవరణలోని అరుగుపై పిల్లలతో కలిసి దిగులుగా కూర్చుని కనిపించింది. విషయమేమిటని ఆరా తీస్తే రజిత తన దీనగాథను వివరించింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...
వరంగల్ రూరల్ : ‘నా భర్త సదానందం(28). మాకు ఉన్న రెండు ఎకరాల్లో ఏటా పత్తి, ఇతర పంటల సాగు చేస్తూ జీవిస్తున్నాం. ఏ సంవత్సరం కూడా అతివృష్టి లేదా అనావృష్టి కారణాలతో లాభాలు కళ్ల చూడలేదు. దీంతో నేను కూడా కూలి పనులకు వెళ్తూ పదో, పరకో సంపాదించేదాన్ని. అయితే, ఈ ఏడాది నా భర్త మా భూమిలోనే పత్తి వేశాడు. పత్తి గింజలు, ఎరువులు, పురుగు మందుల కోసం తెలిసిన వారి వద్ద సుమారు రూ.4 లక్షల మేర అప్పులు తెచ్చాడు. గత నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా పత్తి పంట జాలు వారింది. దీంతో పంట చేతికి రాదని తేలిపోయింది. ఇక ఏం చేయాలో ఆయనకు పాలు పోలేదు. పత్తి పంటలో గడ్డి చనిపోవడానికి పిచికారీ చేయాల్సిన మందు తాగి గత నెల 27న సాయంత్రం 5గంటల ప్రాంతంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ రోజు నేను కూలి పనికి పోయి ఇంటికి వచ్చేసరికి చుట్టు పక్కల వాళ్లంతా మా ఇంటి దగ్గర గుమికూడారు. విషయం తెలుసుకున్న నేను, చుట్టు పక్కల వాళ్ల సహకారంతో నా భర్త సదానందంను చికిత్స నిమిత్తం పరకాలలోని సంతోష్ కుమార్ ఆస్పత్రికి తీసుకువెళ్లాం. అక్కడ చికిత్స పొందుతూ 30వ తేదీన ఉదయం మృతి చెందాడు. ప్రస్తుతం మా పిల్లలు ఆరేళ్ల యశ్వంత్, ఐదేళ్ల సన్నీతో పాటు వృద్ధులైన అత్తామామలను పోషించాల్సిన బాధ్యత నాపై పడింది. దీంతో కూలి పనులకు వెళ్తున్నా. నా భర్త చనిపోయి ఇంకా నెల కూడా ఎల్లలేదు. ఆ దుఃఖం నుంచి కూడా మేం తేరుకోలేదు. ఇంతలోనే మాకు అప్పులు ఇచ్చిన వాళ్లు వాటిని తీర్చాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అప్పు తీసుకున్నప్పుడు తీర్చాల్సిన బాధ్యత కూడా మాపై ఉంది. కానీ ఐదో తరగతి వరకు చదువుకున్న నాకు చిన్నతనంలోనే పెళ్లి కాగా ఇద్దరు కుమారులు జన్మించారు. ఇప్పుడు నా భర్త సదానందం మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడు. అప్పులు తీర్చడం మాట పక్కన పెడితే కుటుంబ పోషణకే అష్టకష్టాలు పడుతున్నా. ఈ సమయంలో అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదు. మా దీనగాధ విని కలెక్టర్ సారు ఏదైనా దారి చూపిస్తారేమోననే ఆశతో కలుద్దామని వచ్చాను. కానీ సార్ లేడు’
అతివృష్టి లేదా అనావృష్టితో ఏటా నష్టమే తప్ప లాభం కళ్లచూడని వేలాది మంది రైతుల్లో సదానందం ఒకరు. ‘పంట నష్టపోయాను.. అప్పులు తీర్చే మార్గం లేదు.. అప్పులు ఇచ్చిన వాళ్ల ముందు తల ఎత్తుకోవడం ఎలా’ అనే బాధతో ఆయన లోకాన్నే వీడిపోయాడు. అసలే కుటుంబం పెద్ద కోల్పోయిన దుఃఖంలో ఉన్న సదానందం కుటుంబానికి ఇప్పుడు కనీస ఓదార్పు అవసరం. కానీ ఒంటరి మహిళ అనే జాలి కూడా లేకుండా అప్పులు చెల్లించాలని వెంట పడుతున్నారనేది రజిత ఆవేదన. ఆమెను ప్రభుత్వం తరఫున ఆదుకునేలా జిల్లా అధికారులు స్పందిస్తారని ఆశిద్దాం..
Advertisement
Advertisement