‘మీ ముక్తి మార్షల్’ పేరుతో గులాబ్ గ్యాంగ్ సేవలు ప్రారంభం
సాక్షి, ముంబై:
రాత్రి వేళ్లలో విధులు ముగించుకుని లోకల్ రైళ్లలో ఇళ్లకు చేరుకునే మహిళలకు రక్షణగా నిలిచేందుకు ముక్తి ఫౌండేషన్‌కు చెందిన ‘గులాబ్ గ్యాంగ్’ నడుం బిగించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పుర స్కరించుకుని శనివారం నుంచి ఈ గ్యాంగ్ ‘మీ ముక్తి మార్షల్’ పేరుతో మహిళా ఉద్యోగులకు సేవలందిస్తోంది. స్మితా ఠాక్రే చొరవ వల్ల ముందుగా మీ ముక్తి మార్షల్ పథకాన్ని పశ్చిమ రైల్వే మార్గంలో ప్రారంభించారు. ఆ తర్వాత సెంట్రల్, హార్బర్ రైల్వే మార్గాలకు కూడా ఈ సేవలను విస్తరించనున్నారు. ‘ ఒక్కో బృందంలో మార్షల్ ఆర్ట్స్ శిక్షణ పొందిన 12 మంది యువతులు ఉంటారు. రాత్రి తొమ్మిదిన్నర నుంచి అర్ధరాత్రి 12.30 గంటల వరకు అంధేరి-బోరివలి స్టేషన్ల మధ్య మహిళా ప్రయాణికులపై దృష్టి సారిస్తారు. అసాంఘిక దుష్టశక్తులు మహిళా ప్రయాణికులను ఇబ్బందిపెడితే ఈ బృందం సభ్యులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగిస్తార’ని రైల్వే అధికారులు తెలిపారు.
మారుతున్న కాలంతో పురుషులతో సమానంగా మహిళలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రైవేటు కార్యాలయాలు, ఇతర వాణిజ్య సంస్థలు, ఆస్పత్రుల్లో రెండో షిప్టులో పనిచేస్తున్న మహిళలు విధులు ముగించుకుని అర్ధరాత్రి ఇళ్లకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఒంటరిగా లోకల్ రైళ్లలో ప్రయాణించే మహిళలను వేధించడం, అత్యాచారయత్నం చేయడం, చోరీ, ఈవ్‌టీజింగ్ లాంటి అనేక సంఘటనలు చోటుచేసుకోవడం వల్ల వారిలో ఆందోళన రెట్టింపవుతోంది. అయితే మహిళల్లో ఉన్న అభద్రత భావాన్ని తొలగించడంతో పాటు వారికి రక్షణగా మేమున్నామనే భావనను నెలకొల్పేందుకు గులాబ్ గ్యాంగ్ సభ్యులు రంగంలోకి దిగారు.
మార్షల్ ఆఫ్ ఆర్ట్స్ శిక్షణ పొందిన యువతులు రాత్రులు ఒంటరిగా ప్రయాణించే మహిళలకు రక్షణగా ఉంటున్నారు. మహిళలను ఇబ్బందులను గురిచేసే వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయడంపైనే దృష్టి సారించారు.కాగా, శివార్ల్లలో దాదాపు అన్ని లోకల్ రైల్వే స్టేషన్లలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), సాధారణ పోలీసులు ఉంటారు. సిబ్బంది కొరత వల్ల వీరు అంతటా దృష్టి సారించలేకపోతున్నారు. దీంతో రైళ్లు, స్టేషన్ పరిసరాల్లో మహిళలపై నేరాలు పెరిగిపోయాయి. దీంతో వారికి భద్రత కల్పించేందుకు సిత్మాఠాక్రే చొరవతో గులాబ్ గ్యాంగ్ సేవలందించేందుకు ముందుకు వచ్చింది. దీనిపై మహిళా ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మహిళల భద్రతకు భరోసా
Published Sat, Mar 8 2014 10:55 PM | Last Updated on Sat, Sep 2 2017 4:29 AM
Advertisement