విధానసభ ఎన్నికల్లో మహిళల భద్రతే కీలకాశంగా మారింది. గత ఎన్నికల సమయంలో ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్రహోదా, అవినీతి నిర్మూలన తదితర అంశాలకు ఆయా రాజకీయ పార్టీలు ప్రాధాన్యమిచ్చాయి. అయితే ఈసారి అందుకు భిన్నంగా ప్రచారం సాగిస్తున్నాయి.
న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు మహిళా భద్రత అంశానికే పెద్దపీట వేశాయి. అధికారంలోకి ఎవరు వచ్చినా జాతీయ రాజధాని నగరంలో ప్రధాన సమస్య అయిన మహిళా భద్రతను తొలుత పరిష్కరిం చాలని అనేకమంది స్థానికులు కోరుతున్నారు. నిత్యావసరాల ధరల పెరుగుదల, అస్తవ్యస్తంగా మారిన ట్రాఫిక్ సమస్యలను కూడా పరిష్కరించాలనేది స్థానికుల అభిమతంగా ఉంది. దీంతోపాటు విద్యుత్, నీటి సరఫరా నిరంతరాయంగా జరగాలని వారంతా ఆకాంక్షిస్తున్నారు.
నేరరహిత నగరంగా మార్చాలి
ఈ విషయమై ప్రశాంత్‌రావ్ అనే ఉపాధ్యాయుడు మాట్లాడుతూ ‘అత్యాచారాలు, దోపిడీలు, హత్యలు నగరంలో సర్వసాధారణమైపోయాయి. మహిళలనే లక్ష్యంగా చేసుకుని నేరాలు జరుగుతున్నాయి’అని అన్నారు. నగరంలో అనేకమంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారని, వారిలో కొందరు తరచూ లైంగిక వేధింపులకు గురవుతున్నారన్నారు. కొత్త ప్రభుత్వం జాతీయ రాజధానిని నేరరహిత నగరంగా మారుస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.
మహిళలు జాగ్రత్తగా ఉండాలి
ఇదే విషయమై దీతి గుప్తా అనే మహిళ మాట్లాడుతూ ‘మహిళలు కచ్చితంగా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. చదువు, కర్తవ్య నిర్వహణతోపాటు ఇతర అవసరాల కోసం వారంతా విధిగా బయటికి వెళ్లాల్సి ఉంటుంది. రోజు మార్చి రోజు నగరంలో అత్యాచారాలు జరుగుతున్నా యి. ఇది నన్ను బాగా భయానికి గురిచేస్తోంది’ అని అన్నారు. ఇదే అంశంపై ఆల్ ఇండియా రేడియో ఉద్యోగి ఎస్.ఎస్.రంగా, ప్రభుత్వ ఉపాధ్యాయుడు ముఖేష్‌శర్మ మాట్లాడుతూ 17 మిలియన్ల మంది నివసిస్తున్న ఈ నగరంలో మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమివ్వాల్సి ఉందన్నారు. అత్యాచార కేసుల సంఖ్య ఎంతమాత్రం తగ్గడం లేదు’అని అన్నారు. దీంతోపాటు ప్రజారవాణా వ్యవస్థ,మౌలిక వసతులను మెరుగుపరచడం వంటి కీలకాంశాలపైనా ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు.
జాగరూకతతో ఉంటా: షాలిని
ఇదే విషయమై నగరంలో ఉంటున్న బీహార్‌కు చెందిన షాలిని అనే విద్యార్థిని మాట్లాడుతూ అభద్రతా భావం కారణంగా బయటికి వెళ్లినపుడు జాగరూకతతో ఉంటానని తెలిపింది. రాత్రిపూట ఇంకా జాగ్రత్తగా ఉంటానంది. పారిశుధ్యంపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతయి నా ఉందని మరికొందరు ఓటర్లు అభిప్రాయపడుతున్నారు.
దుర్గంధంతో ఇబ్బందులపాలు
ఈ విషయమై దీతి గుప్తా మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో దుర్గంధం తీవ్రంగా ఉందని, ఈ కారణంగా నగరవాసులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ సమస్య పరిష్కారం కోసం అధికార యంత్రాంగం ఎంతో చేయాల్సి ఉందన్నారు. లేకపోతే పరిస్థితులు చేయిదాటిపోతాయన్నారు.
ఇక అవినీతి గురించి కొంతమంది మాట్లాడినప్పటికీ అత్యధికులు మాత్రం మహిళా భద్రత అంశాన్నే ఎక్కువగా ప్రస్తావించారు. అత్యధిక శాతం మంది ఓటర్లు ఈ అంశం గురించే మాట్లాడుతున్నారనే విషయాన్ని బీజేపీ, ఆప్‌లు కూడా అంగీకరించాయి. ఈ విషయమై బీజేపీ అధికార ప్రతినిధి హరీష్ ఖురానా మాట్లాడుతూ అది నిజమేనన్నారు. ఇదే అంశంపై ఆప్ నాయకురాలు అతిషి మర్లేనా మాట్లాడుతూ అనేకమంది నగరవాసులలు మహిళా భద్రత, నిరుద్యోగం అంశాలకు ప్రాధాన్యమిస్తున్నారన్నారు. అయితే ఈ సమస్యకు ఏ పార్టీ చక్కని పరిష్కారమిస్తుందనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజే పీ, ఆప్‌లపైనే ప్రజల దృష్టంతా ఉంది. కాంగ్రెస్ పార్టీ గురించి ఎవరూ ప్రస్తావించడమే లేదు.
ఆప్.. సరిగ్గా సరిపోతుంది
ఢిల్లీలో పరిపాలనకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీయే చక్కగా సరిపోతుందని గుప్తా అనే స్థానికుడు అభిప్రాయపడ్డారు. స్థానిక సమస్యలపై ప్రధానమంత్రి దృష్టి సారించడం సాధ్యం కాదని, అందువల్ల ఆప్ మాత్రమే ఈ పనిచేయగలుగుతుందన్నారు.
ధరల్ని నియంత్రించింది
ఈ వాదనతో శర్మ అనే ఉపాధ్యాయుడు ఏకీభవించారు. ‘ఆప్... నాకు ఎంతో దగ్గరగా ఉంటుంది. నాకే కాదు అందరికీ దగ్గరగా ఉంటుంది. ఆ పార్టీ నాయకులు సామాన్యులనే ఇష్టపడతారు. అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ ధరలతోపాటు అవినీతిని విజయవంతంగా నియంత్రించగలిగింది’అని అన్నారు. మరోసారి అధికారంలోకి వచ్చినా చేయగలుగుతుందన్నారు.
బీజేపీయే బెటర్
అయితే ఈ వాదనతో రంగా అనే స్థానికుడు ఏకీభవించలేదు. జాతీయ రాజధానికి బీజేపీయే ఉత్తమమని అభిప్రాయపడ్డారు. పైగా కేంద్రంలో నరేంద్రమోదీ అధికారంలో ఉన్నారన్నారు. ఈసారి ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందన్నారు. ఆటోరిక్షా నడుపుకుని జీవితం సాగించే 57 ఏళ్ల రాంకిషన్‌కూడా కమలానికే మొగ్గుచూపారు. నిరుపేదలను ఆ పార్టీ మాత్రమే అర్థం చేసుకోగలుగుతుందన్నారు. కాగా వచ్చే నెల ఏడో తేదీన విధానసభ ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే.
మహిళల భద్రతే ప్రధానాంశం
Published Tue, Jan 20 2015 12:02 AM | Last Updated on Sat, Sep 2 2017 7:55 PM
Advertisement
Advertisement