
నటనకు త్వరలో స్వస్తి
- ఇక పూర్తిగా రాజకీయాల్లో : ఎంపీ రమ్య
- గతంలో అంగీకరించిన చిత్రాల్లో నటిస్తున్నా
- కొత్తగా ఒక్క సినిమానూ అంగీకరించలేదు
బెంగళూరు, న్యూస్‌లైన్ : బహు భాషా నటి, మండ్య ఎంపీ (కాంగ్రెస్) రమ్య నటనకు గుడ్‌బై చెప్పబోతోంది. ఇక్కడి మైసూరు లాంప్స్ ఫ్యాక్టరీ ఆవరణలో ‘ఆర్యన్’ చిత్రం పాట చిత్రీకరణ జరుగుతోంది. హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్, రమ్యల మధ్య సోమవారం పాట చిత్రీకరణ జరిగింది. ఈ సందర్బంగా తనను కలిసిన విలేకరులతో ఆమె మాట్లాడారు. మూడు రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతుందన్నారు. ప్రస్తుతం తను అంగీకరించిన దిల్ కా రాజా, నీర్ దోసె, కోడి రామకృష్ణ దర్శకత్వంలో కన్నడ, తెలుగు భాషలలో తెరకెక్కుతున్న చిత్రం (పేరు ఇంకా నిర్ణయం కాలేదు) పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు.
ఈ సినిమాల తరువాత ఒక్క సినిమా కూడా అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. నటన, రాజకీయాలకు ఒకే సారి న్యాయం చేయలేనని భావించి సినిమా రంగానికి గుడ్‌బై చెప్పాలనుకుంటున్నానని తెలిపారు. ఒక సినిమా పూర్తి కావాలంటే 35 నుంచి 40 రోజులు పడుతున్నదని, ఈ రోజుల్లో ప్రజలకు దూరంగా ఉండాల్సి వస్తోందని వివరించారు. మరో పదేళ్ల తర్వాత శివరాజ్‌కుమార్ (శివన్న) సోదరిగా నటించే అవకాశం వస్తే తప్పకుండా స్వీకరిస్తానని తెలిపారు.
కాగా రమ్య ప్రకటనపై శాండల్‌వుండ్ వర్గాలు భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. సుమారు ఆరు నెలల కిందట మండ్య లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆమె గెలుపొందారు. మళ్లీ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. సినిమాలలో నటిస్తూ, ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటారని ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టే అవకాశాలున్నాయి. దీనిని అడ్డుకోవడానికి రమ్య ముందు జాగ్రత్తగా ఆ ప్రకటన చేసి ఉంటారని ఆ వర్గాలు భావిస్తున్నాయి.