ఇక వెలగపూడి నుంచే యనమల పాలన
అమరావతి : ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం వెలగపూడి నుంచి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తన శాఖ కార్యకలాపాలను నిర్వహించనున్నారు. గురువారం ఆర్ధిక శాఖ కార్యాలయాన్ని ప్రారంభించినంతరం ఇక అక్కడి నుంచే వరుస సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. పలువురు మంత్రులు వెలగపూడిలో కార్యాలయాలు ప్రారంభించినా అప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించారు తప్ప మళ్లీ తిరిగి సచివాలయానికి వెళ్లిన దాఖలాలు లేవు.
గురువారం ఉదయం రాష్ట్ర పట్టణాభివృద్ధి పరిపాలనాపరమైన సంస్కరణలపై ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘ సమావేశాన్ని యనమల తన ఛాంబర్‌లో నిర్వహిస్తారు. ఈ సమావేశానికి మంత్రులు యనమల, కె.అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, కిమిడి మృణాళిని హాజరవుతారు. పట్టణాభివృద్ధి శాఖ అధికారులు కూడా పాల్గొంటారు. జీఎస్‌టీ, రెవెన్యూ సిద్ధంగా ఉన్నామా లేదా, ఆదాయం ఎలా పెంచుకోవాలి అనే అంశాలపై చర్చిస్తారు. అనంతరం ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమై రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకూ సమకూరిన ఆదాయం, భవిష్యత్‌లో ఇంకా రావాల్సిన ఆదాయంతో పాటు అందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షిస్తారు.
కేంద్రం జీఎస్‌టీ బిల్లును ఆమోదించిన అనంతరం రాష్ట్రానికి వచ్చే ఆదాయంపై కూడా మంత్రి సమీక్షించనున్నారు. ఆడిట్ శాఖతో పాటు రైతు, మహిళా ఆర్థిక సహకార సంస్థలపై కూడా యనమల సమీక్షిస్తారు. శుక్రవారం ఉదయం ఏపీ జనరల్ లైఫ్ ఇన్సూరెన్స్ డైరెక్టర్స్, వర్కర్స్, ప్రాజెక్టు డైరెక్టర్లతో సమీక్షిస్తారు. పర్యాటక విధానంపై మంత్రివర్గ ఉప సంఘ సమావేశం, జీఎస్టీపై సమీక్ష, నక్సలైట్ సమస్యపై మంత్రివర్గ ఉప సంఘ సమావేశాన్ని యనమల నిర్వహిస్తారు. సెప్టెంబర్ మూడున మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల సమావేశంలో పరిపాలన, ఆర్థిక క్రమశిక్షణకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు.