ప్రజలపై భారం మోపం
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల భరోసా
హైదరాబాద్: ప్రజలపై భారం మోపకుండా ఖజానాకు ఆదాయం పెంచుకునే వేరే మార్గాలను తమ ప్రభుత్వం అన్వేషిస్తుందని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. అనవసరపు ఖర్చులు తగ్గించుకోవటం, వాణిజ్య పన్నులపై కోర్టులు, అధికారుల వద్ద ఉన్న స్టేలను ఎత్తి వేయటం ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటామని వెల్లడించారు. ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీల అమలుపై అనుమానాలు, సందేహాలు అక్కర్లేదన్నారు. ఆదివారం సచివాలయంలోని సౌత్ హెచ్ బ్లాక్‌లో యనమల ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బడ్జెట్ తయారీకి సంబంధించి ప్రతిపాదనలు పంపాల్సిందిగా వివిధ శాఖలకు రాసిన లేఖపై తొలి సంతకం చేశారు. కొద్దిసేపు ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఎస్పీ సింగ్, అజయ్ కల్లాం, పీవీ రమేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం యనమల విలేకరులతో మాట్లాడుతూ...
రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచుకోవటంతో పాటు మరోవైపు ప్రజలపై భారం పడకుండా చూసుకోవటం తమ ప్రథమ కర్తవ్యమని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక వనరులు, ఆదాయం, వ్యయం క్లిష్టంగా ఉన్నాయని, వీటిని సరిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకు అవసరమైన చర్యలన్నింటినీ తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం ద్రవ్యలోటు ఎక్కువగా ఉందని, దాన్ని తగ్గించేందుకు ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్‌ఆర్‌బీఎం) నిబంధనలు సవరించాల్సిందిగా కేంద్రాన్ని కోరతామని వెల్లడించారు. ఫలితంగా ద్రవ్యలోటు తగ్గిపోయి ప్రభుత్వం తీసుకునే చర్యలతో మిగులు ఏర్పడుతుందని, గ్రాంట్లు వస్తాయని వివరించారు. రాష్ర్టంలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఉదారంగా సాయం అందించాలని ప్రణాళికా సంఘాన్ని కూడా కోరనున్నట్లు తెలిపారు. ప్రణాళికేతర వ్యయంపై గతంలో 20 శాతం కోత విధించామని, ఇక ముందు ఏం చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటుందో తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేంద్రం సాధారణ అమ్మకపు పన్ను (జనరల్ సేల్స్ టాక్స్) విధించే ఆలోచనలో ఉందని, దీన్ని కూడా తాము పరిశీలించాల్సి ఉందని చెప్పారు.