అర్ధరాత్రి దౌర్జన్యం చేసినా పట్టదా?
ఒక సర్పంచి.. తనకు నచ్చిన పని చేసినందుకు అతడిని భయభ్రాంతులకు గురిచేసేలా అర్ధరాత్రి వచ్చి దుండగులు దౌర్జన్యం చేసినా రాజధాని ప్రాంతంలో ఉన్న పోలీసులకు పట్టదా అని వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. కృష్ణాజిల్లా విజయవాడ శివారులోని నిడమానూరు సర్పంచ్ కోటేశ్వరరావు కారును కొంతమంది గుర్తుతెలియని దుండగులు తగలబెట్టడమే కాక.. ఆయన కార్యాలయానికి తాళం వేసి, పంచాయతీ ఆఫీసులోకి సర్పంచిని వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని, ఇదెక్కడి న్యాయమని నిలదీశారు. తగలబడిన కారును పరిశీలించిన అనంతరం సర్పంచ్ కోటేశ్వరరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆయన ఏమన్నారంటే.. ''విజయవాడలో రకరకాలుగా డబ్బాలు కొట్టుకుంటున్నారు. అదే రాజధానిలో ఒక సర్పంచ్ వాళ్లకు నచ్చినట్లుగా ఉండకపోతే ఆ సర్పంచ్ కారును తగలబెట్టే పరిస్థితిలోకి తీసుకుపోవడం, ఆయన కార్యాలయాన్ని మూసేయడం ఎంతవరకు ధర్మమని అడుగుతున్నా. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. అయినా పోలీసుల దగ్గరకుపోతే వెంటనే వాళ్లు పెట్టాల్సిన కేసులు పెట్టరు, అరెస్టులు జరగవు. సర్పంచ్‌ని భయపెట్టేలా అర్ధరాత్రి వచ్చి దుండగులు కారు తగలబెట్టేసి, ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేస్తున్నారు. పట్టపగలే కార్యాలయాన్ని మూసేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికలు బి-ఫారంల ప్రకారం జరగవు. అవి రాజకీయాలకు అతీతం. అందరూ మద్దతిస్తేనే సర్పంచ్‌గా ఎన్నికవుతారు.

అయినా ఇప్పుడు మాత్రం అంతా అధికార పార్టీ వాళ్లకు నచ్చిన ప్రకారమే జరగాలి, ఎవరైనా అభ్యంతరం చెబితే బెదిరించడం, పంచాయతీ కార్యాలయాన్ని కూడా మూసేసి తాళాలు వేస్తున్నారంటే అర్థం ఏముంది? నా ఆఫీసు తాళం నేను తెరుచుకోవాలంటే గొడవ పడాల్సి వస్తోందంటే ఎలా? పట్టపగలు రాజధాని ప్రాంతంలో 10వేల ఓట్లున్న మేజర్ పంచాయతీలో పట్టపగలు బీసీలకు అన్యాయం జరుగుతోంది. ఈ ప్రభుత్వం బీసీలకు అండగా ఉన్నట్లు ఎలా చెప్పుకోగలదు? నాలుగు కత్తెర్లు, ఇస్త్రీ పెట్టెలు ఇస్తే న్యాయం చేసినట్లు కాదు.
నాన్నగారి కాలంలో వాళ్ల పిల్లలు చదువుకోవాలి, అందుకు అప్పులపాలు కాకూడదని ఆ పిల్లలను ఇంజనీర్లు, డాక్టర్లుగా చేసే కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబు వచ్చారు, మళ్లీ కథ మొదటికి వచ్చేసింది. వాళ్లు ఇచ్చేది 35 వేలు, ఫీజులు చూస్తే లక్షల్లో ఉన్నాయి. అంతటితో ఆగిపోలేదు.. నచ్చని సర్పంచుల మీద దాడులు, కార్లు తగలబెట్టడం, పోలీసుల వద్దకు వెళ్తే నిందితులపై కేసులు పెట్టకపోవడం .. ఇవన్నీ చేస్తున్నారు. కేవలం రెచ్చగొట్టాలనే కార్యాలయానికి తాళం వేస్తున్నారు. రాజధానిలో పోలీసులను వాడుకుంటూ దౌర్జన్యం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే గ్రామంలో వైఎస్ఆర్సీపీకి 900 ఓట్ల మెజారిటీ వచ్చింది.

ఇదే పద్ధతి కొనసాగితే చూస్తూ ఊరుకోబోమని చంద్రబాబుకు గట్టిగా చెబుతున్నాం. ఇక రెండేళ్లే ఉంది.. ఆ తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే, ప్రజల ప్రభుత్వమే. చంద్రబాబు పాలన ఎల్లకాలం సాగదు, ప్రజలు ఆయనను బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయం. ఈ దుర్మార్గానికి పాల్పడిన వాళ్లను రోడ్డుమీద కొట్టుకుంటూ తీసుకెళ్లి అరెస్టు చేస్తే కొద్దోగొప్పో చర్యలు తీసుకున్నారని ప్రజలకు తెలుస్తుంది. ఏదో తూతూ మంత్రం వ్యవహారం చేస్తే మాత్రం చంద్రబాబు త్వరలోనే బంగాళాఖాతంలో కలిసిపోతారు. బీసీల వల్లే గెలిచానని చెప్పుకొన్నారు. వాళ్లు తిరగబడితే ఎలా ఉంటుందో ఆయనకు తెలుస్తుంది'' అని ఆయన చెప్పారు.