జయలలిత విగ్రహం
సాక్షి, చెన్నై : అమ్మ జయలలిత విగ్రహం రచ్చకెక్కింది. అమ్మ స్థానంలో మరెవర్నో తీసుకొచ్చి పెట్టారన్న విమర్శలు అన్నాడిఎంకే పాలకుల్ని ఇరకాటంలో పడేసింది. దీంతో ఆ విగ్రహాన్ని మార్చేందుకు నిర్ణయించారు.
అన్నాడిఎంకే వర్గాలు అమ్మ జయలలిత 70వ జయంతి వేడుక శనివారం ఘనంగా జరిపిన విషయం తెలిసిందే. ఈ సందర్భాన్నిపురస్కరించుకుని రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయంలో అమ్మ నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ విగ్రహాన్ని సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంలు ఆవిష్కరించారు. ఇంత వరకు బాగానే ఉన్నా, అస్సలు అక్కడ ఉన్న విగ్రహం జయలలిత దేనా..? అన్న ప్రశ్న అందరిలో మొదలైయింది. జయలలిత ముఖం పోలికలు ఆ విగ్రహంలో లేవన్న విమర్శలు బయలు దేరాయి. అమ్మ స్థానంలో మరెవర్నో తీసుకొచ్చి పెట్టినట్టున్నారని అన్నాడిఎంకే కేడర్ సైతం విమర్శల్ని గుప్పించే పనిలో పడ్డారని చెప్పవచ్చు.
ఇక, సామాజిక మాధ్యమాల్లో అయితే, ఆ విగ్రహం చర్చ హోరెత్తింది. అక్కడున్నది అమ్మా...చిన్నమ్మా..? అంటూ కొందరు ప్రశ్నించారు. కొందరు సీనియర్ నేత వలర్మతిని నిలబెట్టినట్టుందని, మరి కొందరు సీఎం పళని స్వామి సతీమణి ముఖాన్ని పోలినట్టుందని రక రకాల వ్యంగ్యాస్త్రాలతో సామాజిక మాధ్యమాల ద్వారా అన్నాడిఎంకే వర్గాలపై దాడి చేసిన వాళ్లు ఎక్కువే. విగ్రహావిష్కరణ సమయంలో మత్స్య శాఖ మంత్రి జయకుమార్‌ను పదే పదే మీడియా ప్రశ్నించగా, అమ్మ విగ్రహమే క్షుణ్ణంగా చూడండంటూ సమాధానం ఇచ్చి వెళ్లడం మరింత చమత్కారాలకు దారి తీశాయి.
మార్పుకు నిర్ణయం : అమ్మ ఎక్కడ ..? అని ప్రశ్నిస్తూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు హోరెత్తడం ఓ వైపు ఉంటే, మరో వైపు అన్నాడిఎంకే వర్గాలు సైతం విగ్రహం మీద పెదవి విప్పడం చర్చకు దారి తీసింది. అన్నాడిఎంకే కేడర్ అమ్మేది అని ప్రశ్నించే స్థాయి పరిస్థితి చేరింది. అదే సమయంలో అన్నాడిఎంకే అమ్మ శిబిరం నేత దినకరన్ సైతం పన్నీరు, పళనిల తీరుపై విమర్శల దాడిని పెంచారు. అమ్మ విగ్రహాన్ని పరిహాసం చేశారని మండి పడ్డారు. అమ్మ విగ్రహాన్నే సక్రమంగా చేయించ లేని వాళ్లు, ఇక పార్టీ నిర్వాకాన్ని ఏ మేరకు ఒలక బెడుతున్నారో కేడర్ పరిగణించాలని సూచించారు.
ఇక, జయలలిత మేన కోడలు దీప సైతం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తూ ఆ విగ్రహాన్ని తొలగించాల్సిందేని డిమాండ్ చేశారు. అలాగే, ఈ విగ్రహావిష్కరణకు దూరంగా ఉన్న మైలాడుతురై ఎంపి భారతి మోహన్ కూడా విమర్శలు ఎక్కుబెట్టడం విగ్రహం ఆవిష్కరణ రచ్చకెక్కింది. ఇది మరింత జఠిలం అయ్యే అవకాశాలు ఉండటంతో పాలకులు మేల్కొన్నట్టున్నారు. విగ్రహాన్ని మార్చేందుకు తగ్గ చర్యల్లో పడ్డారు. ఈ విషయంగా మత్స్య శాఖ మంత్రి జయకుమార్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, ఆ విగ్రహాన్ని మార్చి, మరో విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు చర్యలు తీసుకుంటామని, ఈ రచ్చను ఇంతటితో వదలి పెట్టాలని వేడుకోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment