సాక్షి, తిరువొత్తియూరు (చెన్నై): ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయిన వైద్య విద్యార్థిని కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడ్డ ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులను చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై మొగప్పేర్ వెస్టు పన్నీరు నగర్‌కు చెందిన ప్రైవేటు సంస్థ అధికారి కుమార్తె (20) జార్జియా దేశంలో ఎంబీబీఎస్ చదువుతోంది. ఈ క్రమంలో కోర్సును సగంలో నిలిపివేసి చెన్నైకి వచ్చిన వైద్య విద్యార్థిని స్థానిక వైద్య కళాశాలలో చేరేందుకు కోసం నీట్ పరీక్షలు తప్పనిసరి కావడంతో చెన్నై తిరుమంగళం 4వ అవెన్యూలోని ఓ కోచింగ్ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటోంది. ఆమె జార్జియా దేశంలో చదువుతున్న సమయం నుంచే ఫేస్‌బుక్‌లో వడపళనికి చెందిన ప్రవీణ్‌కుమార్‌తో పరిచయం ఏర్పడింది. అతను చెన్నైలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. అతని తండ్రి గ్యాస్ ఏజెన్సీ నడుపుతున్నాడు. విద్యార్థిని చెన్నైకి వచ్చిన సంగతి తెలుసుకున్న ప్రవీణ్‌కుమార్ ఆమెను కలుసుకుని తను ప్రేమిస్తున్నట్టు తెలిపాడు. దీనికి తిరస్కరించిన వైద్య విద్యార్థిని స్నేహంగా మెలుగుదామని, ప్రేమించే ప్రసక్తి లేదని కచ్చితంగా చెప్పింది. దీంతో ఆగ్రహించిన ప్రవీణ్‌కుమార్ ఓ పథకం ప్రకారం సురేందర్ (23) అనే తన స్నేహితుడితో కలిసి గురువారం మధ్యాహ్నం కోచింగ్ సెంటర్ నుంచి వస్తున్న వైద్య విద్యార్థినిని బలవంతంగా కారులో కిడ్నాప్ చేసి సురేందర్ ఇంటిలో నిర్బంధించాడు. అనంతరం ప్రవీణ్‌కుమార్ ఆమెపై లైంగికదాడి చేసినట్టు బాధితురాలు పేర్కొంది. అనంతరం ఆ యువకులు వైద్య విద్యార్థినిని తిరిగి కారులో తీసుకొచ్చి ఓచోట వదలి పెట్టి పారిపోయారు. విద్యార్థిని ముఖం, శరీరంపై పలు చోట్ల గాయాలు అయ్యాయి. ఈ సంఘటనపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం వైద్య విద్యార్థినిని కిడ్నాప్ చేసిన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment