రక్తమాంసాలు నిండిన శరీరం కోసం.. క్షణం సుఖం కోసం అడుగడుగునా రాక్షసత్వం నిండిన రాబందులే ఇక్కడ..! ఇళ్లలో బంధు వుల రూపంలోనూ, బడిలో స్నేహితులు, టీచర్ల రూపంలోనూ ఈ కామ పిశాచాలు తిరుగుతుంటాయి. అందుకే ఈ సమాజంలో ఆడబిడ్డకు ఆదరణ కరువైంది. ఒక్కమాటలో చెప్పాలంటే అమ్మాయికి తన తల్లి గర్భం, సమాధిలోనే మనశ్శాంతి. అందుకే అక్కడికే వెళ్లిపోతున్నాను.. రోజూ నిద్రలేని రాత్రిళ్లు గడపడం కంటే.. శాశ్వత నిద్రలోకి వెళ్లిపోవడమే మేలు.. నా చావుతోనైనా ఈ లోకంలో స్త్రీకి న్యాయం లభిస్తుందా..?
16 ఏళ్లకే నూరేళ్లు నిండిన ఓ ఆడబిడ్డ ఆక్రందన ఇది..! చిన్నతనంలోనే జీవితం ఛిద్రమైన ఓ అభాగ్యురాలి దీనగాథ ఇది..! బాల్యంలోనే పుట్టెడు శోకాన్ని అనుభవించిన బాలిక బలవన్మరణ సమయంలో పడిన అంతులేని ఆవేదన ఇది..!
సాక్షి, చెన్నై : ‘అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరగ గలినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు’ అంటూ మహాత్ముడు ఆశించిన మహిళా స్వాతంత్య్రం నేటీకి కలగానే ఉంది. ఇందుకు కారణం రోజుకో చోట మహిళల మీద సాగుతున్న లైంగిక దాడులు, అరచాకాలు, పైశాచికత్వాలే. ముక్కు పచ్చలారని చిన్న పిల్లలు, బాలిక, యువతులు, మహిళలు, వృద్ధల్ని సైతం కామ వాంఛతో వేధించే మృగాళ్లు ఈ సమాజంలో ఉండటమే. అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నా వారికి భద్రత కరువౌతోంది. స్త్రీకి రక్షణగా నిర్భయను తీసుకొచ్చినా, మృగాళ్లను ఫోక్సో చట్టాల కింద అరెస్టు చేసి కటకటాల్లోకి నెడుతున్నా దాడుల్ని మాత్రం కట్టడి చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ సమాజంలో కంటే తల్లి గర్భంలో.., సమాధిలోనే మాకు భద్రత, మనశ్సాంతి అని ఉద్వేగంతో లేఖ రాసి పెట్టి మరీ ఓ బాలిక బలన్మరణానికి పాల్పడటం సర్వత్రా చర్చనీయాంశమైంది.
చదవండి: (జూనియర్ ఆర్టిస్ట్ మానస మృతి.. అంత్యక్రియలకు డబ్బులు లేవు..)
వేధింపులతో విసిగి వేసారి..
చెన్నై శివారులోని మాంగాడులో ఓ బ్యాంకు ఉద్యోగి కుటుంబం నివాసం ఉంటోంది. ఈ ఉద్యోగికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె నర్సింగ్ చదువుతుండగా, రెండో కుమార్తె (16) స్థానికంగా ఉన్న ప్రభుత్వ బాలికల పాఠశాలలో ప్లస్ వన్ చదువుతోంది. ఈ బాలిక ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం ఆదివారం వెలుగు చూసింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. అయితే, మరణించేందుకు ముందుగా ఆ బాలిక రాసిన లేఖ అందరి గుండెల్ని పిండేసింది. అంతకు ముందు మరో లేఖలో కొన్ని ఘటనలు పేర్కొన్నా, దానిని చింపి చెత్త బుట్టలో వేయడంతో ఆ లేఖను పోలీసులు తీవ్రంగా పరిగణించారు.
ఆ బాలిక రాసి పెట్టిన లేఖలో.. మనస్సు నిండా వేదన.. ఈ వేధింపులు ఇక చాలు, భరించ లేకున్నా అని మొదలెట్టింది. ఎవర్నీ నమ్మకండిæ, టీచర్లనే కాదు, బంధువుల్ని కూడా నమ్మకండి అని ఆవేదన వ్యక్తం చేసింది. నిద్ర రావడం లేదు..కళ్లు మూసినా ఆ వేధింపుల కలలే, కంటి నిండా కన్నీళ్లు, ఎవ్వరికీ చెప్పకోలేకున్నా, ఇక చాలు ఈ సమాజంలో కన్నా తల్లి గర్భం, సమాధిలోనే మాకు భద్రత అని ఉద్వేగ పూరిత వ్యాఖ్యలను లేఖలో పేర్కొంది. ఈ వేధింపుల్ని ఆపేదెవరు, న్యాయం కావాలి అని ముగించింది. అలాగే, తనదే చివరి మరణం కావాలని, ఈ వేధింపుల్ని ఆపాలని, ఇది వరకు చదువుకున్న స్కూళ్లోని ఓ టీచరు కుమారుడి వేధింపులతో పాటుగా మరి కొందరి గురించి మరో లేఖలో ఆ బాలిక పేర్కొంది. వీటిని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఇది వరకు ఆ బాలిక చదువుకున్న పాఠశాలలోని టీచర్లు, వారి పిల్లల వద్ద విచారణ చేపడుతున్నారు. విక్కీ అనే యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
చదవండి: (ఒకే కాలేజీ.. ఫేస్‌బుక్‌లో దగ్గరై సహజీవనం.. పవిత్రకు నిజం తెలిసి..)
ధైర్యంగా ముందుకురండి..
కాగా ఎవరైనా వేధింపులకు గురి చేస్తే.. విద్యార్థినులు ధైర్యంగా విషయాన్ని తల్లిదండ్రులకు లేదా సహచరుల దృష్టికి తీసుకెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. కనీసం తాము సూచించిన టోల్ ఫ్రీ నెంబర్లనైనా ఆశ్రయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
బాలిక రాసిన సూసైడ్ నోట్
Comments
Please login to add a commentAdd a comment