
సాక్షి, చెన్నై/డక్కిలి (నెల్లూరు): చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీలో విద్యార్థిని దువ్వూరి రాగమౌనికారెడ్డి (18) ఆత్మహత్యతో వర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో వర్సిటీ జనవరి 2 వరకు సెలవులు ప్రకటించి, సెమిస్టర్ పరీక్షల్ని రద్దు చేసింది. సెమిస్టర్ పరీక్షలో కాపీ కొట్టిందనే అభియోగంతో ప్రొఫెసర్లు అందరి ముందు అవమానించడంతో మౌనిక హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మౌనిక ఆత్మహత్యతో విద్యార్థులు భగ్గుమన్నారు. ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. విద్యార్థులంతా హాస్టల్‌ను ఖాళీ చేసి వెళ్లిపోవాలని తొలుత యాజమాన్యం ప్రకటించింది. దీనిపై విద్యార్థులు మళ్లీ ఆందోళనకు దిగడంతో జనవరి 2 వరకు సెలవులు ప్రకటించింది.
యాజమాన్యమే బాధ్యత వహించాలి
రాగమౌనిక ఆత్మహత్యకు కళాశాల యాజమాన్యమే బాధ్యత వహించాలని ఆమె తండ్రి రాజారెడ్డి డిమాండ్ చేశారు. తన కుమార్తె తప్పు చేసి ఉంటే పరీక్షల అనంతరం కౌన్సెలింగ్ లేదా చర్యలు తీసుకోవాలని, అంతేగానీ అందరిముందు మానసికం గా కుంగదీయడం మంచి పద్ధతేనా అని ప్రశ్నించారు. రాజారెడ్డి స్వస్థలం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా డక్కిలి మండలంలోని మాటుమడుగు గ్రామం.
ఆయన కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. రాగమౌనిక మృతదేహాన్ని చూసి ఆమె తండ్రి, సోదరుడు కన్నీటి సంద్రంలో మునిగి పోయారు. తాను, తన సోదరి సత్యభామ వర్సిటీలోనే బీటెక్ చదువుతున్నామని, తనకు మౌనిక ఎస్‌ఎంఎస్‌లు చేసినా, పరీక్ష హాల్లో ఉండటంతో ఫోన్ చూడలేదని, బయటకు వచ్చిన తర్వాత చూసి హాస్టల్‌కు పరుగులు తీసినట్లు సోదరుడు రాకేష్ రెడ్డి ఉద్వేగానికి లోనయ్యాడు. అక్కడ తనను లోపలికి పంపలేదని, పంపి ఉంటే తన సోదరిని రక్షించుకునే వాడినని ఆవేదన వ్యక్తంచేశాడు.
ఫోన్‌లో మాట్లాడిన కాసేపటికే..
మౌనికకు ఆమె తల్లిదండ్రులు రాజారెడ్డి, వాణిశ్రీ బుధవారం ఉదయం ఫోన్ చేసి మాట్లాడారు. తర్వాత కొన్ని గంటల్లోనే మౌనిక మరణించిందన్న సమాచారంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. మౌనిక ఆత్మహత్యకు ముందు స్నేహితులకు ‘మిస్ యూ ఆల్.. లవ్ యూ ఆల్’ అంటూ ఫోన్‌లో మెసేజ్‌లు పంపించింది. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు చెన్నై బయలుదేరి వెళ్లారు. ఆమె మృతదేహాన్ని గురువారం స్వగ్రామానికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment