సాక్షి, నడిగూడెం (కోదాడ): కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులను చిదిమేసి ఆపై తనూ బలవన్మరణానికి పాల్పడింది. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలో ఆదివారం సాయంత్రం ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. చెన్నకేశవాపురం గ్రామానికి చెందిన చింతలపాటి రాములు, పద్మల చిన్న కూతురు మౌనిక (28)కు చివ్వెంల మండలం అక్కలదేవిగూడేనికి చెందిన శ్రీనాథ్‌తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి తర్వాత వీరు నడిగూడెం మండలం రామాపురంలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. దంపతులకు మూడేళ్ల చిన్నారి లాక్షిత (3), తొమ్మిది నెలల బాలుడు సంతానం.
ఊరికి వెళ్లొద్దని..: కొద్ది రోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కాగా, శ్రీనాథ్ ఆదివారం సమీప బంధువు ఊరైన రత్నవరం వెళ్తున్నానని భార్యకు చెప్పాడు. దీంతో మౌనిక అక్కడికి వెళ్లొద్దని భర్తను వారించింది. ఒకవేళ వెళ్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఈ విషయంలో దంపతుల మధ్య కొద్దిసేపు గొడవ కూడా జరిగింది. ఆ తర్వాత వినకుండా శ్రీనాథ్ రత్నవరం గ్రామానికి బయలుదేరాడు. భర్త తన మాట వినకుండా రత్నవరం గ్రామానికి వెళ్లడంతో మౌనిక విచక్షణ కోల్పోయింది.
క్షణికావేశంలో తన ఇద్దరు చిన్నారులను తలుపు బేడానికి ఉరివేసింది. వారు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత తానూ గది మధ్యలో ఉన్న ఇనుపరాడ్‌కు ఉరివేసుకుంది. సాయంత్రం ఇంటికి వచ్చిన శ్రీనాథ్ ఎంత పిలిచినా భార్య తలుపులు తీయకపోవడంతో ఇరుగుపొరుగు వారి సహాయంతో తలుపులను తొలగించి చూడగా మౌనిక, ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా కనిపించారు. గ్రామస్తుల సమాచారంతో ఎస్‌ఐ ఎం.ఏడుకొండలు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
(చదవండి: ఐటీ సంస్థ మహిళా అధికారి ఆత్మహత్య)
Comments
Please login to add a commentAdd a comment