
రజని మృతదేహం మృతిచెందిన పిల్లలు మౌనిక,సురేష్
త్రిపురాంతకం: క్షణికావేశం ముగ్గురి నిండు ప్రాణాలు గాలిలో కలిపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తల్లి తొలుత తన కుమార్తె, కుమారుడికి ఉరేసి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని మేడపిలో బుధవారం జరిగింది. ఈ సంఘటనలో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన గుమ్మా రజని (26)ని గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం మక్కెళ్లపాడుకు చెందిన గుమ్మా అంజికి ఇచ్చి వివాహం చేశారు. భర్త అంజి వ్యవసాయం పనులు చేస్తుండేవాడు.
ఆమెకు కుమార్తె మౌనిక (5), కుమారుడు సతీష్ (3) ఉన్నారు. కుటుంబం కలహాల నేపథ్యంలో రజని మేడపిలోని పుట్టింట్లో 20 రోజులుగా ఉంటోంది. ఆమె తల్లిదండ్రులు రామతీర్థం వద్ద కూలి పనులకు వెళ్లారు. ఇంటి వద్ద రజని నాయనమ్మ, తాత మాత్రమే ఉన్నారు. చీకటి పడే సమయంలో తొలుత కుమార్తెకు, కుమారుడిని ఫ్యాన్ కొక్కీకి ఉరేసి చంపి ఆ తర్వాత తల్లి రజని కూడా ఆత్మహత్యకు పాల్పడింది.
ముగ్గురు నిర్జీవంగా వేలాడుతుండటాన్ని కుటుంబ సభ్యులు ఆలస్యంగా గుర్తించడంతో పొద్దుపోయిన తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. ఒకేసారి తల్లి, పిల్లల ఆత్మహత్యతో బంధువుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎస్‌ఐ కమలాకర్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment