ధరలతో తలపడబోతున్న స్మార్ట్ ఫోన్ దిగ్గజాలు
పోటాపోటీగా మార్కెట్లో దూసుకెళ్తున్న స్మార్ట్ ఫోన్ దిగ్గజాలు మరోమారు ధరలతో హోరాహోరీగా తలపడబోతున్నాయి. ఐఫోన్ కిల్లర్ గా దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ వారం క్రితమే గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్ల ధర 840 డాలర్ల నుంచి 850 డాలర్ల మధ్యలో ఉండేలా అంటే దేశీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.54,045 నుంచి రూ.54,707 వరకు నిర్ణయించింది. ప్రస్తుతం శాంసంగ్ తన కొత్త గెలాక్సీలను రంగంలోకి దింపగా.. ఆపిల్ సైతం తన కొత్త ఐఫోన్ ను త్వరలోనే తీసుకురాబోతున్నట్టు టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఫోన్ ధర కూడా శాంసంగ్ కొత్త గెలాక్సీలకు సమానంగా ఉండేలా నిర్ణయిస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఓలెడ్ డిస్ ప్లేతో లాంచ్ కాబోతున్న హై-ఎండ్ ఐఫోన్ 8, 64జీబీ మోడల్ ప్రారంభధర ధర 850 డాలర్ల నుంచి 900 డాలర్ల మధ్యలో ఉంటుందని మ్యాక్రూమర్స్.కామ్ తెలిపింది. అంటే దేశీయ కరెన్సీ ప్రకారం సుమారు 54,707 రూపాయల నుంచి 57,925 రూపాయలు. అదేవిధంగా ఇటీవల కొత్తగా లాంచ్ చేసిన ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ ప్రారంభ ధరలు కూడా 649 డాలర్లు, 749 డాలర్ల వరకు నిర్ణయించనుందని పేర్కొంది. వైర్ లెస్ ఛార్జింగ్, నో ఫిజికల్ హోమ్ బటన్, 3డీ ఫేసియల్ రికగ్నైజేషన్, లేదా ఐరిస్ స్కానింగ్ ఈ కొత్త ఐఫోన్8లో ప్రత్యేకతలు. ''ట్రూ కలర్ ఐప్యాడ్ ప్రొ'' స్క్రీన్ టెక్నాలజీని కూడా మొదటిసారి వాడబోతుందని తెలుస్తోంది. అంతకముందు కూడా శాంసంగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా గెలాక్సీ నోట్ 7 తీసుకొచ్చిన తర్వాతనే, ఐఫోన్ తన కొత్త ఐఫోన్ 7ను రంగంలోకి దించింది. గెలాక్సీ నోట్7 పేలుళ్ల ఘటనతో తీవ్ర ఇరకాటంలో కూరుకుపోవడం, ఐఫోన్ 7కు భారీ ఎత్తున కలిసివచ్చింది.