జియో ఎఫెక్ట్ : వొడాఫోన్ ''సూపర్ అవర్'' ప్లాన్స్
టెలికాం ఇండస్ట్రిలో రిలయన్స్ జియో ఎఫెక్ట్ అంతా ఇంతా కాదు. జియో తెరతీస్తున్న ధరల యుద్దానికి టెలికాం కంపెనీలు కూడా వరుసబెట్టి ఆఫర్ల మీద ఆఫర్ల కురిపిస్తున్నాయి. తాజాగా వొడాఫోన్ తన ప్రీపెయిడ్, పోస్టు పెయిడ్ కస్టమర్లకు ప్రారంభ ధర రూ.7 నుంచి అవర్లీ అన్‌లిమిటెడ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ''సూపర్ అవర్'' ప్లాన్ కింద వొడాఫోన్ ఈ ఆఫర్లను తమ కస్టమర్లకు పరిమిత వ్యవధిలో లాంచ్ చేసింది. ఈ ప్లాన్ల కింద అపరిమితంగా వొడాఫోన్ నుంచి వొడాఫోన్‌కు ఉచితంగా లోకల్ కాల్స్ చేసుకోవచ్చు. అంతేకాక సూపర్ అవర్లీ ప్యాక్‌ల కింద అపరిమిత 3జీ, 4జీ డేటా ప్రయోజనాలు వొడాఫోన్ తన కస్టమర్లకు అందిస్తోంది. గత నెలలోనే ధన్ ధనా ధన్ ఆఫర్ కింద జియో కొత్త ప్లాన్లను ప్రకటించింది. జియో ఆ కొత్త ఆఫర్లు తీసుకురాగానే, టెలికాం దిగ్గజాలు కూడా తమ సరికొత్త ప్లాన్లను ప్రకటిస్తున్నాయి.
సూపర్ అవర్ ఆఫర్లను యాక్టివేట్ చేసుకోవాలంటే వొడాఫోన్ ప్రీపెయిడ్ కస్టమర్లు రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. అదే పోస్టుపెయిడ్ కస్టమర్లు అయితే సంబంధిత యూఎస్‌ఎస్‌డీకి డయల్ చేసి ఈ ప్లాన్లను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలి.
వొడాఫోన్ సూపర్ అవర్స్ ప్యాక్స్ గురించి కొన్ని విశేషాలు...
1. గంటకు రూ.7 : ఈ ప్యాక్ కింద గంట పాటు వొడాఫోన్ టూ వొడాఫోన్ లోకల్ కాల్స్ అపరిమితంగా మాట్లాడుకోవచ్చు.
2. గంటకు రూ.21 : ఈ ప్యాక్ కింద 4జీ, 3జీ డేటాను అపరిమితంగా వాడుకోవచ్చు.
3. గంట వ్యవధి అనేది ప్యాక్‌లు యాక్టివేట్ చేసుకునే వొడాఫోన్ సిస్టమ్స్ సమయం ప్రకారం ఉంటుందని వొడాఫోన్ ఇండియా చెప్పింది.
4. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్1 వరకు ఈ ప్యాక్లు అందుబాటు
5. మల్టిపుల్ రీఛార్జ్‌లపై కూడా వొడాఫోన సూపర్ అవర్ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. దీంతో ఎన్నిసార్లైనా కస్టమర్లకు ఈ ఆఫర్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు
6. ముంబై, మహారాష్ట్ర, గోవా సర్వీసు ప్రాంతాల్లో, వాయిస్ సూపర్ అవర్ ప్లాన్లు దగ్గర్లోని గంట నుంచి యాక్టివేట్‌లో ఉంటాయి. అంటే, మీరు మధ్యాహ్నం 2.45కి రీఛార్జ్ చేయించుకుంటే, 3 గంటల నుంచి ఇవి అందుబాటులోకి వస్తాయి.
7. అయితే సూపర్ అవర్ స్కీమ్ కింద ఆఫర్ చేసే 3జీ, 4జీ స్పీడ్ డేటా ప్యాక్‌లు ఆంధ్రప్రదేశ్, బిహార్, జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘర్ రాష్ట్రాల్లో అందుబాటులో లేవు.
8. అపరిమిత డేటా ప్యాక్‌లు వాడే కస్టమర్లకు కూడా ఇవి అందుబాటులోఉండవు.