చొప్పదండి: మండల కేంద్రానికి చెందిన గొలిపెల్లి బుచ్చయ్య, రమలకు సంతానం లేకపోవడంతో రమ సోదరి భూలక్ష్మిని రెండోవివాహం చేసుకున్నాడు. అయినా వారికి సంతానం కలుగలేదు. దీంతో కరీంనగర్ ప్రాంతానికి చెందిన అనాథాశ్రమం నుంచి లహరి(8)అనే చిన్నారిని దత్తత తీసుకున్నారు. చిరు ప్రాయంలోనే ఆ చిన్నారికి గుండెకు సంబంధిత సమస్య ఉందని గుర్తించారు. కూలీ, నాలీ చేసుకొనే కుటుంబం కావడంతో ఎటువంటి చికిత్సలు చేయించలేదు. దత్తత తీసుకున్న కొద్ది రోజులకు కుటుంబయజమాని బుచ్చయ్య మృతి చెందాడు.
అనంతరం తల్లులిద్దరు లహరిని అల్లారుముద్దుగా చూసుకుంటూ వస్తున్నారు. లహరి ఈ తరుణంలో పలుమార్లు చికిత్స పొందింది. స్థానిక బాలికల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చిన్నారి రెండో తరగతి చదువుతోంది. సోమవారం తన పుట్టినరోజు కావడంతో పాఠశాలకు వెళ్లిన చిన్నారి అకస్మాత్తుగా గుండెపోటుకు గురైంది. వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ‘పుట్టినరోజే నూరేళ్లు నిండాయా తల్లి’ అంటూ చిన్నారిని అల్లారుముద్దుగా చూసుకుంటున్న ఆ తల్లులు తల్లడిల్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment