1.92 లక్షల ఎకరాల్లో పంట నష్టం
రాష్ర్టవ్యాప్తంగా అంచనా వేస్తున్న అధికార యంత్రాంగం
నివేదికను కేంద్రానికి పంపేందుకు కసరత్తు
నెల రోజుల్లో పరిహారం చెల్లించే అవకాశం
వరికి ఎకరానికి రూ. 5,400, మొక్కజొన్నకు రూ. 4 వేలు
అల్పపీడనం ఏర్పడితే మరో వారం రోజులు వర్షాలే
నేడు రాష్ర్టవ్యాప్తంగా వడగళ్ల వానలు పడే అవకాశం
హైదరాబాద్: అకాల వర్షాలు, వడగళ్ల వానలతో రాష్ర్టంలో పంట నష్టం రోజురోజుకూ పెరుగుతోంది. అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. గురువారం నాటికి దాదాపు 1.92 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు అధికారులు లెక్కగట్టారు. రాష్ర్టవ్యాప్తంగా 116 మండలాల్లోని 889 గ్రామాల్లో తీవ్ర పంట నష్టం జరిగినట్లు తేల్చారు. 1.07 లక్షల ఎకరాల్లోని వరి, మొక్కజొన్న, సజ్జ, నువ్వులు, జొన్న పంటలు నాశనమయ్యాయి. అలాగే 84 వేల ఎకరాల్లో మామిడి, బొప్పాయి, కూరగాయలు తదితర ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. వ్యవసాయ, రెవెన్యూ బృందాలు గ్రామాల్లో పర్యటిస్తూ పంట నష్టాన్ని అంచనా వేస్తున్నాయి. వారం రోజుల్లో నివేదిక రూపొందించి కేంద్ర సాయం కోరతామని ఉన్నతాధికారులు చెప్పారు.
వరి, మామిడికే అధిక నష్టం..
వరి పంట, మామిడి తోటలకే తీవ్రంగా నష్టం జరిగింది. 72,873 ఎకరాల్లో వరి, 70,236 ఎకరాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. 33 శాతం పంట నష్టపోయినా పూర్తి పరిహారం ఇవ్వాలని కేంద్రం ఇటీవల నిర్ణయించిన నేపథ్యంలో రైతులు అందుకోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వరికి ఎకరానికి రూ. 5,400 నష్టపరిహారాన్ని కేంద్రం చెల్లిస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాలు దానికి మరికొంత క లిపి రూ. 6 వేల వరకు ఇస్తున్నాయి. రాష్ర్ట ప్రభుత్వం కూడా ఈ పరిహారాన్ని పెంచే యోచనలో ఉన్నట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
మొక్కజొన్న, జొన్న, సజ్జ, నువ్వులకు కేంద్రం నుంచి ఎకరానికి రూ. 4 వేల చొప్పున పరిహారం వస్తుంది. రాష్ర్టంలో పంట నష్టంపై కేంద్రానికి నివేదిక పంపిన తర్వాత నెల రోజుల్లో రైతులకు పరిహారం అందుతుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు బీమా సంస్థల తోనూ వ్యవసాయ శాఖ అధికారులు గురువారం సమావేశమై ఎంతమందికి పంటల బీమా అందుతోందో అంచనా వేశారు. ఆ వివరాలు మాత్రం బయటకు రాలేదు
ఇంకా వర్ష భయమే...
ఇంకా వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. శుక్రవారం రాష్ట్రంలో అనేకచోట్ల వడగళ్లు, ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. అంతేగాక పశ్చిమతీర ప్రాంతం నుంచి తూర్పుతీర ప్రాంతం వైపునకు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఈ ప్రభావంతో ఈ నెల 23 వరకు రాష్ట్రంలో సాధారణం నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు పేర్కొంది. గత 24 గంటల్లో వరంగల్ జిల్లా గోవిందరావుపేటలో 6 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అలాగే మోమిపేటలో 4, కొల్లాపూర్‌లో 3, మెట్‌పల్లి, ఎదపల్లి, ముథోల్‌లో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షం పడింది.