10 నుంచి పింఛన్లు
- తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు
- ఇప్పటి వరకు గుర్తించిన అర్హుల సంఖ్య.. 25.68 లక్షలు
- 20.09 లక్షల పింఛన్లకే జిల్లా కలెక్టర్ల ఆమోదం
- పంపిణీ నిమిత్తం రూ. 206 కోట్లు సిద్ధం చేసిన ‘సెర్ప్’
సాక్షి, హైదరాబాద్: ‘ఆసరా’ సామాజిక భద్రతా పింఛన్లను ఈ నెల 10వ తేదీ నుంచి పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ‘ఆసరా’కు సుమారు 39 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా... అధికారులు పరిశీలన అనంతరం ఇప్పటివరకు 25.68 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. కానీ అర్హులుగా గుర్తించినవారిలో కేవలం 20.09 లక్షల మందికి మాత్రమే పింఛన్ల మంజూరుకు ఆయా జిల్లాల కలెక్టర్లు (హైదరాబాద్ జిల్లా మినహా) ఆమోదం తెలిపినట్లు సమాచారం.
లబ్ధిదారుల సంఖ్య సంతృప్త స్థాయికి చేరేవరకు దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా... ఇలా జరుగుతుండడం గమనార్హం. అయితే సాఫ్ట్‌వేర్ సమస్యల కారణంగా లబ్ధిదారుల వివరాల్లో తప్పులు దొర్లుతున్నాయని, దీంతో పింఛన్ల ఆమోదంలో జాప్యం జరుగుతోందని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక ఆమోదం పొందిన మేరకు పింఛన్ల పంపిణీ కోసం సుమా రు రూ. 206 కోట్ల 83 లక్షలను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు సిద్ధం చేశారు. ఈ సొమ్మును ఆయా జిల్లాలకు పంపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
హైదరాబాద్‌లో బ్రేక్!
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ‘ఆసరా’ పింఛన్ల మంజూరు ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా యుద్ధప్రాతిపదికన కొనసాగుతుంటే.. హైదరాబాద్ జిల్లాలో మాత్రం అడుగు ముందుకు పడడం లేదు. ఈ జిల్లావ్యాప్తంగా పింఛను కోసం 1.38 లక్షల దరఖాస్తులు రాగా... ఇందులో దాదాపు 87 వేల మందిని అర్హులుగా తేల్చారు. కానీ క్షేతస్థాయిలో అధికారులు తమ కంప్యూటర్లలో నిక్షిప్తం చేసిన లబ్ధిదారుల సమాచారం (డాటా) ఉన్నతాధికారులకు చేరేసరికి గందరగోళంగా మారినట్లు తెలిసింది.
ఒక మండలంలోని లబ్ధిదారుల సమాచారం వేరొక మండలం జాబితాల్లో కనిపిస్తుండడం, దరఖాస్తుదారుల వయస్సు మారిపోవడం వంటి సమస్యలతో పింఛన్ల మంజూరుకు బ్రేక్ పడింది. దీంతో ఈ దఫా జిల్లాలో పింఛన్లను కంప్యూటర్ జనరేటెడ్ పాస్‌బుక్‌తో సంబంధం లేకుండా సాధారణంగా పంపిణీ చేయాలని జిల్లా అధికారులు భావిస్తున్నారు. కానీ దీనికి సెర్ప్ అధికారులు ససేమిరా అన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలో ఏర్పడిన సాంకేతిక ఇబ్బందులను పరిష్కరించేందుకు టీసీఎస్, ఎన్‌ఐసీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
జోగినులకు పింఛన్లు!
వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు మాదిరిగానే జోగినులకు కూడా ‘ఆసరా’ పింఛన్ అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. జోగినులను గుర్తించడంలో ఎదురయ్యే సామాజిక ఇబ్బందుల అంశంపై ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు వెయ్యిమంది జోగినీ వ్యవస్థ కింద ఉన్నట్లు అధికారుల అంచనా.