సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : సామాజిక భద్రత పించన్ల పంపిణీ పథకం (ఆసరా) లబ్ధిదారుల ఎంపిక జాబితా ప్రాథమికంగా కొలిక్కి వచ్చింది. దీంతో శనివారం నుంచి పింఛను మొత్తాన్ని పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆసరా పథకం కింద పింఛన్లు కోరుతూ జిల్లాలో వివిధ కేటగిరీల కింద 5,55,662 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 2.38 లక్షల మందిని లబ్ధిదారులుగా గుర్తించి ప్రాథమికంగా జాబితా సిద్ధం చేశారు.
ఈ జాబితా ఆధారంగా శనివారం నుంచి వికలాంగులకు రూ.1500, ఇతరులకు రూ.వేయి చొప్పున పింఛను మొత్తాన్ని నగదు రూపంలో పంపిణీ చేయనున్నారు. జిల్లాలో నగదు పంపిణీకి రూ.22.5 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే మండలస్థాయిలో సగటున రూ.10లక్షల చొప్పున జమ చేశారు. అవసరమైన చోట తక్షణమే నిధుల విడుదల చేయాల్సిందిగా ట్రెజరీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరో 70వేల మంది లబ్ధిదారులను గుర్తించినా, సాంకేతిక కారణాలతో వారి పేరును తొలి జాబితాలో చేర్చడం లేదు.
జిల్లాలో మొత్తంగా 3.15లక్షల మంది ‘ఆసరా’కు అర్హత సాధిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. లబ్దిదారుల ఎంపిక మార్గదర్శకాల్లో స్వల్పమార్పులు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో మరికొంత మందికి ప్రయోజనం చేకూరే సూచన కనిపిస్తోంది.
కుటుంబ సమగ్ర సర్వేను ప్రాతిపదికగా తీసుకుంటే జిల్లాలో గరిష్టంగా 3,39,856 మందికి మించి ఆసరా పథకం కింద లబ్ధి చేకూరే అవకాశం లేదని విశ్వసనీయంగా తెలిసింది. గతంలో జిల్లాలో 4.62లక్షల మందికి సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ పథకం లబ్ధి చేకూరింది. ప్రస్తుత గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే దరఖాస్తుదారుల్లో కనీసం రెండు లక్షలకు పైగా అనర్హులుగా తేలే సూచన కనిపిస్తోంది.
కొలిక్కి రాని ఎంపిక ప్రక్రియ
రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు అక్టోబర్ మొదటి వారం నుంచి అధికారులు లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అక్టోబర్ నెలాఖరుకు దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి లబ్ధిదారుల జాబితా రూపొందించాలని తొలుత నిర్ణయించారు. అయితే దరఖాస్తుల పరిశీలన తీరుపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో పరిశీలన, లబ్దిదారుల ఎంపిక గడువును మరింత పెంచారు.
నవంబరు మొదటి వారం నుంచే లబ్ధిదారులకు పింఛను మొత్తం పంపిణీ చేయాలని నిర్ణయించినా లబ్దిదారుల జాబితా కొలిక్కి రాకపోవడంతో పంపిణీ ప్రక్రియ వాయిదా పడింది. నవంబర్ 28వ తేదీని గడువుగా నిర్ణయించి 29వ తేదీ నుంచి పింఛను మొత్తం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తొలి జాబితాను గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించడంతో తమ పేర్లు లేని వారు ఆందోళనకు దిగుతున్నారు. అర్హత ఉండీ జాబితాలో పేరు లేని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. దీంతో దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఇప్పట్లో తుదిరూపునకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
నేటినుంచి ఆసరా
Published Sat, Nov 29 2014 3:52 AM | Last Updated on Sat, Sep 2 2017 5:17 PM
Advertisement