సాక్షి, భూపాలపల్లి : ఆపదలో ఉన్న ఓ మహిళను ఆస్పత్రికి చేర్చాల్సిన 108 సిబ్బంది ఆమె గుండె కొట్టుకోవడం లేదని చెప్పడం, అప్పటిదాకా ఆమెను తరలించిన ఆటో డ్రైవర్ నిజంగానే చనిపోయిందేమోనని మార్గ మధ్యంలోనే వదిలేసి వెళ్లడం, కరోనా భయంతో సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో సమయానికి వైద్యం అందక ఓ మహిళ మృతి చెందింది. ఈ అమానవీయ ఘటన మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. వెంకటాపూర్ గ్రామానికి చెందిన శంకరమ్మ (45) మొక్కు తీర్చుకోవడానికి మంచిర్యాల జిల్లా భీమారం మండలం తాళ్లగూడెంలో ఉండే తన చెల్లి ఇంటికి మంగళవారం వచ్చింది. అక్కడ ఆమె శ్వాస ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతూ పడిపోయింది.
నోటి నుంచి నురుగులు, ముక్కు నుంచి రక్తం రావడంతో కుటుంబసభ్యులు 108కు సమాచారం అందించారు. అది రావడం ఆలస్యమవడంతో ఆమెను ఆటోలో తీసుకుని బయల్దేరారు. జైపూర్ మండలం వెలిశాల సమీపంలోకి రాగానే 108 వాహనం వారికి ఎదురైంది. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న శంకరమ్మను ఆటోలోనే పరీక్షించిన 108 సిబ్బంది ఆమె గుండె కొట్టుకోవడం లేదని, పల్స్ పడిపోయిందని చెప్పి ఆస్పత్రికి తరలించకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆటోడ్రైవర్ సైతం మహిళను రోడ్డుపైనే దింపి వెళ్లిపోగా, ఆ కుటుంబం సహాయం కోసం ఎంతమందిని వేడుకున్నా ఎవరూ ముందుకు రాలేదు. అటుగా వెళ్తున్న వాహనదారులు ప్రైవేటు అంబులెన్స్‌కు సమాచారం అందించగా.. దానిలో మంచిర్యాలకు తరలిస్తుండగానే శంకరమ్మ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇలా వైద్యసాయం అందాల్సినవారిని తక్షణమే ఆస్పత్రికి తరలించాల్సిన 108 సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం, కరోనా భయంతో ఎవరూ దగ్గరకు రాకపోవడంతో ఓ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment