‘108’ కమిటీతో జీవీకే చర్చలు
సభ్యులకు అభిప్రాయాలు వెల్లడించిన ప్రతినిధులు
నివేదికలోని అంశాలు అవాస్తవమని స్పష్టీకరణ
హైదరాబాద్: ‘108’ నివేదికపై జీవీకే-ఈఎంఆర్‌ఐ ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు ఏకపక్షంగా నివేదిక రూపొందించారని ఆరోపించారు. ‘108’ నిర్వహణ, ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ఇద్దరు ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేసిన ద్విసభ్య కమిటీతో జీవీకే-ఈఎంఆర్‌ఐ ప్రతినిధులు హైదరాబాద్‌లో మంగళవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ‘ప్రభుత్వాన్ని, ప్రజలను, ఉద్యోగులను మోసం చేస్తూ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్న జీవీకే సంస్థను తక్షణమే 108 నిర్వహణ బాధ్యతల నుంచి తప్పించి ప్రత్యామ్నాయమార్గాలను అన్వేషించాలి.’ అని కమిటీ సర్కారుకు సిఫారసు చేయడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో జీవీకే-ఈఎంఆర్‌ఐ ప్రతినిధులు ఆగమేఘాల మీద కమిటీ సభ్యులైన ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్, గాదరి కిశోర్‌లతో చర్చలు జరిపారు. ఉద్యోగుల ఆరోపణల ఆధారంగానే నివేదిక తయారు చేశారని, ఉద్యోగుల సంక్షేమాన్ని తాము గాలికి వదిలేశామని అనడంలో వాస్తవం లేదని వారు అన్నట్లు తెలిసింది.
ప్రభుత్వాన్ని మోసం చేస్తూ అక్రమాలకు పాల్పడుతూ రూ.కోట్ల నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లుగా నివేదికలో ప్రస్తావించడంపట అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో మరోమారు నివేదికలో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వవర్గాల సమాచారం. ఇదిలావుండగా...ద్విసభ్య కమిటీ నివేదిక సమర్పించిన నేపథ్యంలో ‘108’ బాధ్యతల నుంచి జీవీకేను తప్పిస్తారన్న ప్రచారం జరిగింది. అయితే ఒప్పందం ప్రకారం తొలగించడానికి వీలులేదని జీవీకే వర్గాలు పేర్కొంటున్నట్లు తెలిసింది.