ఏడో తరగతి.. ఐటీ ఉద్యోగి | Sakshi
Sakshi News home page

ఏడో తరగతి.. ఐటీ ఉద్యోగి

Published Wed, Oct 30 2019 4:36 AM

12 Year Old Boy Software Employee - Sakshi

మణికొండ: ఆ విద్యార్థి వారంలో మూడు రోజులు స్కూల్‌కు వెళ్లి పాఠాలు వింటాడు.. మరో మూడు రోజులు సాఫ్ట్‌వేర్‌ సంస్థలో డేటా సైంటిస్ట్‌గా ఉద్యోగం చేస్తాడు. చిన్నప్పటి నుంచే తల్లి దండ్రులు ప్రోత్సహించడంతో 12 ఏళ్ల వయసులోనే ఏకంగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని సాధించాడు. గుంటూరు జిల్లా తెనాలికి చెం దిన పి.రాజ్‌కుమార్, ప్రియ క్యాప్‌జెమినీలో ఉద్యోగం చేస్తూ మణికొండ మున్సిపాలిటీ కేంద్రంలో నివసిస్తున్నారు. వారి కుమారుడు శరత్‌ స్థానిక శ్రీచైతన్య పాఠశాలలో ఏడో తర గతి చదువుతున్నాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులైన తల్లిదండ్రులిద్దరూ ఇంట్లో రోజూ ల్యాప్‌ టాప్‌ల్లో పనిచేయటాన్ని ఆ విద్యార్థి చిన్నప్పటి నుంచి నిశితంగా గమనిస్తూ వస్తున్నాడు.

దీంతో ఏడేళ్ల వయసులోనే అతడిలో కోడింగ్, జావా తదితర సాఫ్ట్‌వేర్‌లపై ఆసక్తి పెరగ డంతో వాటిని నేర్చుకున్నాడు. అతడిలోని టాలెంట్‌ను గమనించిన తల్లిదండ్రులు ఐటీ ఉద్యోగిగా పనికి వస్తాడని నిర్ణయించారు. పలు ఐటీ సంస్థల ఉద్యోగాలకు దరఖాస్తు చేసి ఇంటర్వ్యూలకు వెళ్లాడు. ఇటీవల మోంటైగ్నే సంస్థలో నెలకు రూ.25 వేల గౌరవ వేతనంతో శరత్‌కు డేటా సైంటిస్ట్‌గా ఉద్యోగం దక్కింది. దాంతో పాటుగా కొన్ని రోజులు ఉద్యోగం, కొన్ని రోజులు చదువుకునేందుకు అవకాశం కల్పించేందుకు అంగీకరించారు.

మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభినందనలు.. 
12 ఏళ్ల వయసులో ఏడో తరగతి చదువుతూ డేటా సైంటిస్ట్‌గా ఉద్యోగం దక్కించుకున్న శరత్‌ను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభినందించారు. శరత్‌ తల్లిదండ్రులు మంగళవారం మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా శరత్‌కు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement