
పాలు అనుకుని కిరోసిన్ తాగిన చిన్నారి..
వర్ని (నిజామాబాద్) : పాలు, కిరోసిన్‌కు తేడా తెలియని పద్నాలుగు నెలల పసివాడు... ఆకలి వేసి డబ్బా కనిపించడంతో పాలు అనుకుని తాగేయడంతో ప్రాణాలు వదిలాడు. ఈ విషాద సంఘటన నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని కూనీపూర్ గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... గ్రామా శ్రీకాంత్, గాయత్రి దంపతులు కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి ఈశ్వర్ అనే పద్నాలుగు నెలల కుమారుడు ఉన్నాడు. గత కొంతకాలంగా చిన్నారికి డబ్బా పాలు అలవాటు చేశారు. కాగా మంగళవారం రాత్రి తల్లి వంట పనిలో నిమగ్నమై ఉండగా ఈశ్వర్ అడుకుంటూ వెళ్లి పాల డబ్బా అనుకుని చిన్న సీసాలో నింపి ఉన్న కిరోసిన్ తాగాడు. కొద్దిసేపటికి ఏడుస్తుండడంతో, బాలుడు కిరోసిన్ తాగినట్టుగా గుర్తించిన గాయత్రి స్థానికుల సహకారంతో వర్ని ఆస్పత్రికి తీసుకెళ్లింది. వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి బోధన్‌లోని ప్రైవేటు పిల్లల ఆస్పత్రి కి తీసుకెళ్లింది. పరిస్థితి విషమంగా ఉందని వైద్యుడు చెప్పడంతో... నిజామాబాద్ తీసుకెళ్దామని ప్రయత్నిస్తున్న కమ్రంలోనే తమ కుమారుడు మృతి చెందాడని తల్లిదండ్రులు బోరున విలపించారు.