సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జెండా ఎగురవేసిన అనంతరం ప్రసంగిస్తున్న గవర్నర్ నరసింహన్.
సాక్షి, హైదరాబాద్ : జాతీయ సగటు కంటే మిన్నగా 18 శాతం వృద్ధి రేటుతో పరుగులు పెడుతోన్న తెలంగాణ దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నదని గవర్నర్ నరసింహన్ చెప్పారు. అన్నిటికి అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించిందన్నారు. 69వ గణతంత్ర వేడుకల్లో భాగంగా శుక్రవారం పరేడ్ గ్రౌండ్స్‌లో గవర్నర్ జెండా ఎగురవేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రగతి నివేదికను చదివివినించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, రాష్ట్ర మంత్రులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
మై గవర్నమెంట్ క్రియేటింగ్ వండర్స్ : ‘‘బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా, ప్రజల ఆకాంక్షలకు అనుగణంగా నా ప్రభుత్వం పనిచేస్తున్నది. రాష్ట్రంగా ఏర్పడి మూడేళ్ల కాలమే అయినా అన్ని రంగాల్లో అసమాన వేగంతో దూసుకెళుతున్నది. 2014లో 14 వేల మెగావాట్లుగా ఉన్న విద్యుత్ ఉత్పత్తి నేడు 28వేల మెగావాట్లకు చేరుకుంది. తద్వారా తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా అవతరించింది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పవర్ కట్స్‌కు మంగళం పాడాం. అన్నదాతలకు చేయూతగా ఈ ఏడాది జనవరి 1 నుంచి 24 గంటల విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. ఇన్‌పుట్ సబ్సిడీలు, ఎకరాకు రూ.8వేల పెట్టుబడిని అందిస్తున్నాం. నా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. ఆసరా పేరుతో సుమారు 38 లక్షల మంది వృద్ధులకు పెన్షన్లు అందిస్తున్నాం. వికాలంగులకు, బీడీ కార్మికులకు కూడా పెన్షన్లు ఇస్తున్నాం. పరిమితులేవి లేకుండా ఇంట్లో ఒక్కొక్కరికి నెలకు 6 కేజీల చొప్పున బియ్యాన్ని అందజేస్తున్నాం. కల్యాణలక్ష్మి, షాదీ ముబారఖ్ పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ ఆడపిల్లల పెండ్లిళ్లకు ఆర్థిక చేయూతనిస్తున్నాం. ఈ పథకాన్ని ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలకు కూడా వర్తింపజేయాలని ఇటీవలే నిర్ణయించాం. ఈ ఏడాది చివరినాటికి 2.65 లక్షల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తికానున్నాయి. ఆశా వర్కర్లు, వీఆర్‌ఏ, హోంగార్డులు, ఐకేపీ ఉద్యోగులు.. తదితరులకు భారీగా జీతాలు పెంచిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రధానంగా వ్యవసాయ రాష్ట్రం కనుక వ్యవసాయానికంటూ ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయిస్తున్నాం. ప్రాజెక్టుల నిర్మాణం కోసం బడ్జెట్‌లో ఏటా 25వేల కోట్లు కేటాయిస్తున్నాం. నాణ్యమైన విత్తనాలు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్నాం. పండిన ధాన్యాన్ని నిలువ ఉంచుకునేలా గోడౌన్లను నిర్మించాం. రాష్ట్ర ఆవిర్భావం నాటికి 4 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న గోడౌన్ల సామర్థ్యాన్ని 1.5 లక్షల కోట్ల మెట్రిక్ టన్నులకు పెంచాం. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు అందించే కార్యక్రమాన్ని చేపట్టాం. మిషన్ కాకతీయ ద్వారా 46 వేల చెరువులను పునరుద్ధరించాం. తద్వారా సాగు, సాగునీటి అవసరాలు తీరడమేకాక భూగర్భ జల సంపద కూడా పెరిగింది. అవినీతి రహితంగా భూ రికార్డుల ప్రక్షాళన, రైతు సమితుల ఏర్పాటు, వ్యవసాయ అధికారి ఉద్యోగాల భర్తీ తదితర చర్యలు రైతులకు మరింత మేలు కానున్నాయి. యాదవ, కురుమలకు 1.50 కోట్ల గొర్రెలను పంచాలనే ప్రణాళికతో ముందుకు వెళుతున్నాం. ఇప్పటికే 40 లక్షల గొర్రెలను పంచాం. చేపల పెంపకం ద్వారా బెస్త, ముదిరాజ్‌లను, టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటు ద్వారా చేనేత కార్మికులను, మోడ్రన్ సెనూన్ల ద్వారా నాయూ బ్రహ్మణులకు, భారీ వాషింగ్ మిషీన్లను అందించడం ద్వారా రజకులకు.. పెద్ద ఎత్తున చేయూత అందిస్తున్నాం. కేజీ టు పీజీ ఉచిత విద్యావిధానంలో భాగంగా నడుస్తున్నవాటికి తోడు కొత్తగా 542 గురుకులాలను ఏర్పాటుచేశాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన లక్షల మంది పిల్లలు వాటిలో చదువుతున్నారు. ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.1.25లక్షలను ప్రభుత్వం ఖర్చుపెడుతున్నది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆధునీకరిస్తున్నాం. 102, 104, 108 సర్వీసుల ద్వారా వేగంగా సేవలు అందిస్తున్నాం. గర్భిణుల కోసం ప్రత్యేకంగా కేసీఆర్ కిట్ పథకాన్ని రూపొందించాం. గడిచిన మూడేళ్లలో జాతీయ రహదారి పొడవును 3174 కిలో మీటర్ల నుంచి 5701 కి.మీకు పెంచుకున్నాం. ‘తెలంగాణకు హరితహారం’ ద్వారా కోట్లాది మొక్కలు నాటాం. పరిపాలనను ప్రజలకు చేరువ చేసే క్రమంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, పోలీస్ స్టేషన్లను ఏర్పాటుచేసుకున్నాం. అటు పారిశ్రామికంగానూ రాష్ట్రం అద్భుత ప్రగతిని సాధిస్తున్నది. టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటివరకు 6070 పరిశ్రమలకు అనుమతులిచ్చాం. తద్వారా 2 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించగలిగాం. ఐటీ ఎగుమతుల్లో 12 శాతం వృద్ధిని సాధించాం. ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ లాంటి ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీని విస్తరింపజేసేలా పనిచేస్తున్నాం. దేశంలో నూతనంగా ఏర్పడిన తెలంగాణ.. అవకాశాలను అనుకూలంగా మలుచుకుంటూ దేశనిర్మాణానికి పెద్ద ఎత్తున చేయూత ఇస్తున్నది. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు మనమంతా పునరంకితం అవుదాం. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీకివే నా శుభాకాంక్షలు’’ అని గవర్నర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment