తెలంగాణలో 9 వెనకబడిన జిల్లాలే: గవర్నర్
తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 10 జిల్లాల్లో 9 వెనకబడిన జిల్లాలేనని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ చెప్పారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ ఆయన తన ప్రసంగం ప్రారంభించారు. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిందని, ఇది బంగారు తెలంగాణగా అభివృద్ధి చెందడానికి అందరి సహకారం అవసరమని చెప్పారు. వెనకబాటుతనానికి, పేదరికానికి రాజకీయాలే కారణమని, అవినీతికి ఆస్కారం లేని పాలనను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.
హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు ఎక్స్ప్రెస్ హైవేలను అభివృద్ధి పరుస్తున్నామన్నారు. ఉద్యోగులకు అనుకూలంగా ఉండే పాలనను అందిస్తామని, విద్యుత్ సమస్యను అధిగమించేందుకు స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలు పెట్టుకున్నామని, రానున్న మూడేళ్లలో విద్యుత్ సమస్యను అధిగమిస్తామని చెప్పారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగానే వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ కార్యక్రమాలు చేపట్టామని, పేదలకు డబుల్ బెడ్రూం పథకాన్ని పారదర్శకంగా అమలుచేస్తామని గవర్నర్ నరసింహన్ తెలిపారు.