* 38 మంది ప్రముఖులకు తగ్గింపు
* సెక్యూరిటీ వ్యవస్థపై రివ్యూ కమిటీ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ర్టంలో 180 మంది మాజీ ఎమ్మెల్యేలు, కొందరు ప్రముఖులకు కల్పిస్తున్న సెక్యూరిటీని తొలగిస్తూ పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. 38 మంది ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖుల సెక్యూరిటీని కొంతమేర తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేశారు. రాష్ర్ట విభజన అనంతరం తొలిసారిగా రాష్ర్ట ఇంటెలిజెన్‌స ఐజీ నేతృత్వంలోని సెక్యూరిటీ రివ్యూ కమిటీ(ఎస్‌ఆర్‌సీ) మంగళవారం సమావేశమైంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ర్టంలోని ప్రముఖులకు కల్పిస్తున్న సెక్యూరిటీపై సమీక్ష నిర్వహించింది. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లతోపాటు, తొమ్మిది జిల్లాల ఎస్పీలు తమ పరిధిలోని ప్రజాప్రతినిధులు, ఇతర వీఐపీలకు అందిస్తున్న సెక్యూరిటీ వివరాలను కమిటీకి అందజేశారు. మరోవైపు ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం ఐజీ మహేష్ భగవత్‌లు కూడా సమాచారాన్ని సేకరించారు. మొత్తం 180 మంది మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులకు ఉన్న అంగరక్షకులకు ఉపసంహరిస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది. మరో 38 మంది ఎమ్మెల్యేలు, ఇతర వీఐపీలకు ఉన్న సెక్యూరిటీ స్థాయిని తగ్గించింది. ఈ విధంగా సెక్యూరిటీ స్థాయిని తగ్గించిన వారిలో టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు ఉన్నారు.
ఇదిలాఉండగా, ముగ్గురికి జడ్‌ప్లస్, ఆరుగురికి జడ్ కేటగిరి సెక్యూరిటీని కొనసాగిస్తున్నారు. జడ్ ప్లస్ కేటగిరి కింద రాష్ట్ర గవర్నర్ నర్సింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, హైకోర్టు చీఫ్ జస్టిస్ కల్యాణ్‌సేన్ గుప్తాలకు సెక్యూరిటీ ఉండగా, జడ్ కేటగిరి కింద రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మ, నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ఇక మంత్రులందరికీ వై కేటగిరి కింద సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటుచేశారు. కాగా, ఇప్పటి వరకు జెడ్‌ప్లస్, జెడ్ కేటగిరిలో ఉన్నవారికి మాత్రమే ఇచ్చే బుల్లెట్‌ప్రూప్ వాహనాన్ని ఇక వై కేటగిరిలో ఉన్న మంత్రులకు, ఇతర ప్రముఖులకు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు వేయిమంది ప్రముఖులకు సెక్యూరిటీని కల్పించగా, విభజన అనంతరం తెలంగాణలో మూడు వందల మందికి కల్పిస్తున్నారు. లోక్‌సభ సభ్యులు, ఎమ్మెల్యేలకు 2ప్లస్2, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులకు 1ప్లస్ 1 కింద గన్‌మెన్లను కేటాయించారు.
180 మంది మాజీల సెక్యూరిటీ తొలగింపు
Published Wed, Aug 13 2014 1:04 AM | Last Updated on Sat, Sep 15 2018 8:44 PM
Advertisement
Advertisement