- టీఆర్‌ఎస్ సభకు భారీగా తరలిన కార్యకర్తలు
- స్వయంగా పర్యవేక్షించిన మంత్రులు
- పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సుల బుకింగ్
సాక్షి, మహబూబ్‌నగర్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి జరుగుతున్న టీఆర్‌ఎస్ ఆవిర్భావ సభ కావడంతో జిల్లా నుంచి గులాబీదండు పెద్ద ఎత్తున హైదరాబాద్‌కు తరలివెళ్లింది. సోమవారం జింఖానా మైదానంలో ఏర్పాటు చేసిన మహాసభను అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జిల్లా నుంచి జనం పెద్ద ఎత్తున తరలివెళ్లారు. స్వయంగా మంత్రులు జూపల్లి కృష్ణారావు, డా.సి.లకా్ష్మరెడ్డిలు జిల్లాలో మకాం వేసి కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఆర్టీసీ బస్సులను పెద్దఎత్తున ఉపయోగించుకున్నారు. జిల్లా మొత్తం మీద లక్షన్నరకు పైగానే జనం తరలివెళ్లారు. దీంతో జిల్లాలోని అన్నిదారులు కూడా హైదరాబాద్ వైపే కదలాయి. మరోవైపు ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.
ప్రతి నియోజకవర్గం నుంచి పదివేల మందికి పైగానే..
హైదరాబాద్‌కు పక్కనే ఉండడంతో జిల్లా నుంచి భారీగా జన సమీకరణ చేపట్టాలని పైస్థాయి నుంచి ఉన్న ఆదేశాల మేరకు ముఖ్యనాయకులు పక్కా ప్రణాళిక రచించారు. ప్రతి నియోజకవర్గం నుంచి 10వేల మందికి తగ్గకుండా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి వందల సంఖ్యలో వాహనాలను కేటాయించారు. దిశా నిర్దేశం ఇవ్వడం కోసం మంత్రులు జూపల్లి, లకా్ష్మరెడ్డి రంగ ప్రవేశం చేశారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలకు ఎక్కడిక్కడ బాధ్యతలు అప్పగించి సక్సెస్ చేశారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమీటీలు, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు అందరినీ భాగస్వామ్యం చేశారు. కొన్నిచోట్ల పైస్థాయిలో మెప్పు పొందేందుకు నాయకులు హొరాహోరీగా జన సమీకరణ చేపట్టారు. మరోవైపు త్వరలో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో.. సీటు పొందేందుకు ఎమ్మెల్సీ ఆశావహుల పోటీపడ్డారు. బ్రిలియంట్ విద్యాసంస్థల అధినేత కసిరెడ్డి నారాయణరెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, ఈర్లపల్లి శంకర్ తదితర నాయకులు జనసమీకరణలో చురుగ్గా వ్యవహరించారు.
ఆర్టీసీ బస్సులన్నీ అటువైపే..
జిల్లాలోని ఆర్టీసీ బస్సులన్నీ టీఆర్‌ఎస్ మహాసభకు కదలాయి. జిల్లాలో ఆర్టీసీకి 900 బస్సులున్నాయి. వీటిలో దాదాపు 612 బస్సులను టీఆర్‌ఎస్ సభకు జనాన్ని తరలించడం కోసం ఉపయోగించారు. దీంతో జిల్లాలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఒక్క నాగర్‌కర్నూల్ డిపోకు మొత్తం 82 బస్సులుంటే టీఆర్‌ఎస్ సభ కోసం 70 బస్సులను వినియోగించారు. బస్సుల కొరత కారణంగా దూరప్రాంత ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు నిత్యం 40 బస్సులు 80 ట్రిప్పులు వెళ్లేవి. టీఆర్‌ఎస్ మహాసభ కారణంగా పదిహేను బస్సులకు మించి తిరగలేదు. రాయిచూరు, తాండూరు, పరిగి, శ్రీశైలం ప్రయాణికులు ఇబ్బందులుపడ్డారు.
నియోజకవర్గాల వారీగా బస్సుల కేటాయింపు..
మహబూబ్‌నగర్-100, నారాయణపేట-96, షాద్‌నగర్-70, కల్వకుర్తి-75, నాగర్‌కర్నూల్-70, అచ్చంపేట-51, కొల్లాపూర్-55, వనపర్తి-40, గద్వాల్-51, ఇవిగాక కొండగల్, మక్తల్ నియోజకవర్గాలకు తాండూరు, పరిగి, వికారాబాద్ డిపోలకు చెందిన దాదాపు 100 బస్సులను కేటాయించారు.
అన్ని దారులూ పట్నంవైపే..
Published Tue, Apr 28 2015 4:49 AM | Last Updated on Wed, Apr 3 2019 8:52 PM
Advertisement