సర్వే | 19th August Household Mega Survey in Telangana | Sakshi
Sakshi News home page

సర్వే

Published Sun, Aug 17 2014 3:00 AM | Last Updated on Sat, Sep 2 2017 11:58 AM

సర్వే

సర్వే

బ్యాంకు అకౌంట్ నంబరు చెబితే నష్టమేమీ లేదు
 కుటుంబ యజమాని తన బ్యాంకు అకౌంటు నంబరు చెప్పడం వల్ల ఎలాంటి ముప్పు లేదు. అకౌంట్ నంబరు చెప్పడం, చెప్పకపోవడం యజమాని ఇష్టమే. ప్రభుత్వం నుంచి పొందే లబ్ధిని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేయడానికి మాత్రమే అకౌంటు నంబరును అడుగుతున్నారు.
 
 రేషన్‌కార్డు రద్దు కాకూడదనుకుంటే..
 ఒక చోట రేషన్‌కార్డు , మరోచోట స్థిర,చర ఆస్తులు  ఉన్నట్లయితే ... రేషన్‌కార్డు ఉన్న చోటనే సర్వేలో నమోదు చేసుకుంటే మంచిది. అప్పుడే రేషన్‌కార్డు రద్దు కాదు. స్థిర, చర ఆస్తులు ఉన్న చోట సర్వేలో పాల్గొంటే,  అప్పుడు కచ్చితంగా రేషన్‌కార్డు రద్దు అవుతుంది.
 
 సర్వే నుంచి వీరికి మినహాయింపు
 ఇతర ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థులను సర్వే నుంచి మినహాయించారు. అందుకు తగిన ఆధారాలు చూపిస్తే అంటే అడ్మిషన్,  ఫీజుల రశీదులు వగైరా వంటివి. ఎన్యుమరేటర్లకు చూపిస్తే సర్వే పత్రంలో నమోదు చేస్తారు.
   గర్భిణులు, వివిధ కారణాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని సర్వే నుంచి మినహాయించారు.
 
 పొరుగు రాష్ట్రాల్లో ఉన్నవారు రావాల్సిన పనిలేదు
 ఉపాధి కోసం దుబాయి, ముంబై, మహారాష్ట్రకు వెళ్లిన వారు సర్వే కోసం రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ సొంత గ్రామాలకు వచ్చి సర్వేలో నమోదు చేసుకుని తిరిగి వెళ్లిపోతే,  అధికారులు మళ్లీ  విచారణ చేపట్టి వారి పేర్లను తొలగిస్తారు.
 
 ఆదాయం ఎంతో చెబితే చాలు
 కుటుంబ ఆదాయం ఎంతో చెబితే చాలు. ఆదాయ మార్గాల వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు.
 
 ఎవరైనా అనాథలే..
 తల్లిదండ్రులు లేని పిల్లలు తాతలు లేదా సమీప బంధువుల వద్ద పెరగుతున్నా వారిని అనాథలుగానే పరిగణిస్తారు. వీరితో పాటు తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు, తల్లి లేదా తండ్రి వదిలేసినవారు, కొడుకులు లేదా కూతుళ్లు వదిలేసిన  తల్లిదండ్రులను అనాథలుగానే పరిగణిస్తారు.
 
 ఇంటికి తాళం వేసి ఉంటే...
 సర్వే జరిగే 19వ తేదీన ఇంటికి తాళం వేసి ఉంటే,  పొరుగువారి నుంచి ఆ కుటుంబ యజమాని పేరు మాత్రమే నమోదు చేస్తారు. అలాంటి ఇళ్లకు ప్రత్యేకంగా మార్కు వేస్తారు.
 
 నకిలీ ఎన్యుమరేటర్లను నమ్మొద్దు
 సర్వే కోసం నియమించిన ఎన్యుమరేటర్లకు గుర్తింపుకార్డు తప్పనిసరి చేశారు. గుర్తింపు కార్డు లేకుండా సర్వేకు వచ్చామని చెప్పే వారికి ఎలాంటి వివరాలు చెప్పొద్దు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఆస్తుల వివరాలు అడిగితే, సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి.
 
 తప్పుడు సమాచారం చెప్పొద్దు
 సర్వేకు వచ్చే ఎన్యుమరేటర్లకు వాస్తవ వివరాలే తెలపాలి. తప్పుడు సమాచారం ఇస్తే ప్రభుత్వం నుంచి అమలయ్యే సంక్షేమ పథకాలకు అనర్హులుగా గుర్తించే అవకాశం ఉంది. కుటుంబ సామాజిక, ఆర్థిక స్థితిగతుల వివరాలు సమగ్రంగా చెబితేనే రేషన్‌కార్డులు, ఇళ్లు, పెన్షన్లకు అర్హత పొందుతారు.
 
 ఇది రహస్య సమాచారం
 సమగ్రసర్వే ద్వారా సేకరించిన సమాచారం అంతా కూడా రహస్యంగా ఉంటుంది. మూడో వ్యక్తికి కుటుంబ వివరాలు చెప్పరు. సర్వే ఫారం జీరాక్స్‌లను బయటకు ఇవ్వడానికి వీల్లేదు.
 
 కుటుంబాలు పెరిగాయోచ్..
 నీలగిరి : జిల్లాలో కుటుంబాల సంఖ్య అనూహ్యంగా పెరిగింది.  2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 8.75 లక్షల కుటుంబాలు  ఉన్నాయి. కాగా ప్రస్తుతం సమగ్ర కుటుంబసర్వే సిబ్బంది ఇంటింటికి వెళ్లి నంబర్లు వేయడం ద్వారా కుటుంబాల సంఖ్య 11.50 లక్షలకు చేరింది. రెండేళ్లలో 2.75 లక్షల కుటుంబాలు పెరిగాయి. వాస్తవానికి జాతీయ గణాంకాల ప్రకారం జిల్లాలో ప్రతి ఏడాది సగటున 2 శాతం కుటుంబాలు పెరుగుతాయనేది అంచనా. ఉదాహరణకు లక్ష ఇళ్లు ఉంటే.. ఏడాదిలో వాటి సంఖ్య లక్షా రెండు వేలకు పెరగడం లేదా తగ్గడం అనేది జరగాలి. కానీఅధికారుల అంచనాలను పటాపంచలు చేస్తూ రెండేళ్లలో కుటుంబాల సంఖ్య 2.75 లక్షలకు పెరిగింది. దీంతో సర్వేకు అవసరమయ్యే ఫారాలను కూడా ఇప్పుడు అదనంగా తెప్పించాల్సి వస్తోంది. అధికారుల ప్రాథమిక అంచనా మేరకు 9 లక్షల కుటుంబాలకు అవసరమయ్యే ఫారాలకు ఆర్డర్ ఇచ్చారు. కానీ ఇంటినంబర్ల సంఖ్య 11 లక్షలకు దాటడంతో 12 లక్షల ఫారాలను  తెప్పిస్తున్నారు.
 
 పెరిగిన సిబ్బంది
 ఎన్నికల్లో పనిచేసిన వారికంటే... రెండురెట్లు అధికంగా సర్వేకు సిబ్బందిని నియమించారు. కుటుంబాల సంఖ్య పెరగడం వల్ల ఎన్యుమరేటర్ల సంఖ్య 42 వేలకు చేరింది. వీరుగాక సూపర్‌వైజర్లు 2 వేల మంది, సెక్టోరియల్ ఆఫీసర్లు వెయ్యిమందిని నియమించారు. స్కూల్ బస్సులు, ప్రైవేటు వాహనాలు కలిపి మొత్తం 800 వాహనాలు వాడుతున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement