అయ్యో ‘రామా’ | 2 killed, 25 injured as bus overturns in Telangana | Sakshi
Sakshi News home page

అయ్యో ‘రామా’

Published Fri, May 22 2015 5:33 AM | Last Updated on Sun, Sep 3 2017 2:30 AM

అయ్యో ‘రామా’

అయ్యో ‘రామా’

రామయ్య దర్శనం కోసం కొందరు.. పీజీ పరీక్ష కోసం మరికొందరు.. పొట్టచేత పట్టుకొని ఇంకొందరు..ఇలా వేర్వేరు పనుల నిమిత్తం భద్రాచలం బయలుదేరారు. ‘రామబాణం’ ఎక్కితే త్వరగా గమ్యస్థానానికి చేరుకోవచ్చన్న ఉద్దేశంతో ఆ బస్సునే ఎక్కారు. అదే బస్సు తమ మృత్యువుకు కారణమవుతుందని ఊహించలేకపోయూరు. మరో మూడు నిమిషాల్లో భద్రాద్రి చేరుకుంటామనగా లారీ రూపంలో ఎదురొచ్చిన మృత్యువు..‘రామబాణం’ దిశను మార్చేసింది.

అంతే గోదావరి అప్రోచ్‌రోడ్డు పైనుంచి మూడు పల్టీలు కొట్టి సుమారు 40 అడుగుల లోతులో బస్సు పడిపోయింది. 46 మంది ప్రయూణిస్తున్న బస్సులో ఇద్దరు మృతిచెందగా 26 మంది తీవ్రగాయూలపాలయ్యూరు. క్షతగాత్రుల ఆర్తనాదాలు, రక్తపు మరకలతో ఘటనాస్థలి హృదయవిదారకంగా మారింది.

 
 
అదుపు తప్పి ఆర్టీసీ బస్సు బోల్తా
గోదావరి అప్రోచ్‌రోడ్డుపై నుంచి పల్టీలు
ఇద్దరు మృతి.. 26 మందికి తీవ్రగాయాలు
ఆరుగురి పరిస్థితి విషమం..
సారపాక వద్ద భద్రాచలం రోడ్డుపై ఘటన
ఘటనాస్థలికి హుటాహుటిన మంత్రులు, ఖమ్మం ఎంపీ
బూర్గంపాడు: ఖమ్మం నుంచి గురువారం ఉదయం భద్రాచలం బయలుదేరిన ‘రామబాణం’ బస్సు మరో మూడునిమిషాల్లో గమ్యంస్థానం చేరుకుంటుందనగా ప్రమాదం ముంచుకొచ్చింది. అందులోని ప్రయూణికులను భయకంపితులను చేసింది. బస్సు పల్టీలు కొడుతూ గోదావరి అప్రోచ్‌రోడ్ పైనుంచి 40 అడుగుల లోతులో పడిపోయింది. ఏమి జరిగిందో తెలుసుకునేలోపే బస్సులో ఉన్నవారంతా చావుబతుకుల మధ్య రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతున్నారు.

తీవ్రగాయూలతో వారు చేసిన ఆర్తనాదాలు గోదారి తీరాన్ని దుఃఖసాగరంలో ముంచేశాయి. భద్రాచలం నుంచి సారపాక వైపునకు ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు అదుపు తప్పి సిమెంట్ పోల్‌ను ఢీకొట్టి బోల్తా పడింది.
 
మృతులు..క్షతగాత్రులు
ఈ ఘటనలో దుమ్ముగూడెం మండలం సింగారం గ్రామానికి చెందిన బొడ్డు శ్రావణి (30) బస్సులోనే మృతిచెందింది. ఆమెతో పాటు బస్సులో ప్రయాణిస్తున్న ఆమె భర్త లక్ష్మీనారాయణ, పిల్లలు శ్రావణ్‌కుమార్, గాయత్రికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో గాయత్రి పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మంకు రిఫర్ చేశారు. నల్లగొండ జిల్లా కోదాడకు చెందిన శ్రావణి ఆమె భర్త లక్ష్మీనారాయణ దుమ్ముగూడెం మండలం సింగారం వచ్చి కిరాణ దుకాణం నిర్వహిస్తున్నారు. కళ్లముందే భార్య మృతిచెందటంతో లక్ష్మీనారాయణ కన్నీరుమున్నీరయ్యూడు. పిల్లలిద్దరికీ తీవ్రగాయాలు కావటంతో వారిని వెంటనే 108 వాహనంలో భద్రాచలం తరలించారు.

లక్ష్మీనారాయణ మాత్రం భార్య మృతదేహాన్ని బస్సులోంచి వెలికి తీసేంత వరకు అక్కడే రోదిస్తూ కూర్చున్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బస్సుడ్రైవర్ సీహెచ్ వెంకటేశ్వర్లు(45) కూడా మృతిచెందాడు. తీవ్రగాయాలైన డ్రైవర్ వెంకటేశ్వర్లును భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రథమచికిత్స నిర్వహించారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మంకు తరలిస్తున్న క్రమంలో మృతిచెందాడు. గుంటూరుకు చెందిన గడియారం గంగాధర్, తోట చందు, కొత్తగూడెంకు చెందిన సబీరా, బత్తుల విజయలక్ష్మి, రవి, వాణి, దమ్మపేటకు చెందిన తాటి తిరుపతమ్మ, కోదాడ వాసి మాజేటి అనురాధ, జశ్వంత్, సాయిసుమంత్, నల్లగొండ జిల్లా మోతెకు చెందిన వృద్ధురాలు సక్కుబాయమ్మ, వరంగల్ జిల్లా కొరవి మండలానికి చెందిన మాలోతు కిషన్, గుంటూరుకు చెందిన హర్షిత, సాహిత్య,  టేకులపల్లి మండలవాసి జె. అరుణ, కొత్తగూడెంకు సమీపంలోని నెల్లిపాకకు చెందిన మందా పద్మ, టేకులపల్లికి చెందిన ధరావత్ హర్యా, భద్రాచలానికి చెందిన ముత్యాల సుబ్రహ్మణ్యం, కొత్తగూడెం మండలం అంజనాపురం వాసి భూక్యా దివ్యభారతి, ఆమె భర్త మోహన్‌రావు, పిల్లలు ప్రణవి, రాజా, సీతంపేట బంజర గ్రామానికి చెందిన లావుడ్యా రాజు, శేఖరంబంజరకు చెందిన ఇస్లావత్ రమేష్ (బస్సు కండక్టర్) తీవ్రంగా గాయపడ్డారు.క్షతగాత్రులను భద్రాచలంలోని ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్సలు చేయిస్తున్నారు. వీరిలో రవి, వాణి, పద్మ, డి.హస్లీ, గాయత్రిలను మెరుగైన వైద్యం కోసం ఖమ్మం, హైదరాబాద్‌కు తరలించారు.
 
ఘటనాస్థలిని పరిశీలించిన మంత్రులు, ఎంపీ
ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని రవాణశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి, రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధ్యక్షులు, మ్మం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, సున్నం రాజయ్య, జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత పరిశీలించారు. భద్రాచలం ఏరియూ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు.
 
తక్షణమే స్పందించిన పోలీసుశాఖ
భద్రాచలం, కొత్తగూడెం పోలీస్ డివిజన్ అధికారులంతా హుటాహుటిన ఘటనాప్రాంతానికి చేరుకున్నారు. సమీపంలోని ఇసుకక్వారీలో పనిచేస్తున్న కూలీలు కూడా అక్కడకు చేరుకుని క్షతగాత్రులను బయటకు తీశారు. కొత్తగూడెం ఓఎస్డీ జోయల్ డేవిస్, భద్రాచలం ఏఎస్పీ భాస్కరన్,  ట్రైనీ ఐపీఎస్ అధికారి విష్ణు ఎస్ వారియర్, కొత్తగూడెం డీఎస్పీ  సురేందర్‌రావు, భద్రాచలం సీఐ సారంగపాణి, ఎస్‌ఐలు మురళి, ఎంవీ రామారావు క్షతగాత్రులను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
 
హర్ష సేఫ్...
బస్సు బోల్తాపడిన ఘటనలో రాధారపు హర్షవర్ధన్ అనే చిన్నారి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. ఇదే బస్సులో ఉన్న అతని తల్లిదండ్రులు స్వల్ప గాయూలతో బయటపడ్డారు. క్షతగాత్రులందర్నీ స్థానికులు, పోలీసుసిబ్బంది బయటకు తీశారు. హర్షవర్దన్‌మాత్రం బస్సులో ఇరుక్కుపోయి ఏడుస్తున్నాడు. అతనికి ఏమి జరిగిందోనని బయట తల్లిదండ్రులు కన్నీరుపెడుతున్నారు. ఇనుపరాడ్ల సహాయంతో బస్సురేకులను తొలగించి క్షేమంగా హర్షవర్దన్‌ను బయటకు తీయడంతో బాలుడితో పాటు అతని తల్లిదండ్రులు రాజేశ్వరి, యూలాద్రి ఊపిరిపీల్చుకున్నారు.
- బూర్గంపాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement