చేవెళ్ల టికెట్‌ ఎవరికో..! | 2019 Lok Sabha Election TRS Leaders Focus On Chevella Constituency | Sakshi
Sakshi News home page

చేవెళ్ల టికెట్‌ ఎవరికో..!

Published Fri, Mar 1 2019 9:39 AM | Last Updated on Fri, Mar 1 2019 12:15 PM

2019 Lok Sabha Election TRS Leaders Focus On Chevella Constituency - Sakshi

పట్నం మహేందర్‌రెడ్డి, స్వామిగౌడ్‌

సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల పార్లమెంట్‌ స్థానంపై ముఖ్య నేతలు దృష్టి పెట్టారు. రాజకీయ ఉద్ధండులు ఈ స్థానం నుంచి పోటీకి సై అంటున్నారు. హాట్‌సీట్‌గా మారిన ఈ పార్లమెంట్‌ సెగ్మెంట్‌ నుంచి పోటీచేసేందుకు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్‌  స్వామిగౌడ్‌ ఆసక్తి కనబరుస్తున్నారు. పార్టీ అధినేత గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే కదనరంగంలోకి దిగేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధంచేసుకున్నారు. వీరే కాకుండా మరికొందరు కూడా చేవెళ్ల టికెట్‌ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ స్థానాల్లో మెజార్టీ సీట్లు గులాబీ ఖాతాలో ఉండడంతో ముఖ్యనేతలు ఈ సీటుపై దృష్టిసారించారు.

మొన్నటి వరకు మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డికి టికెట్‌ దాదాపు ఖరారు అని విస్తృత ప్రచారం జరిగింది. ఇప్పటికే ఆయన క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇక్కడి నుంచి మరో అభ్యర్థి తెర మీదకు రావడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఉద్యమ నేత, శాసన మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ కూడా ఈ స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. పార్టీ అధిష్టానం అవకాశమిస్తే చేవెళ్ల నుంచి బరిలో దిగుతానని ఆయన స్పష్టం చేస్తున్నారు. అయితే, మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఆయనకు తీవ్ర నిరాశ ఎదురైంది. రాజేంద్రనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్‌ కోసం ప్రయత్నించినా ఆయనకు దక్కలేదు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌కు ఆ స్థానాన్ని ఖరారు చేయడంతో స్వామిగౌడ్‌ వెనక్కితగ్గారు. ఈ సమయంలో ‘భవిష్యత్‌లో చూద్దాం’ అని స్వామిగౌడ్‌కు పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇదే ధీమాతో చేవెళ్ల పార్లమెంట్‌ టికెట్‌ కోసం ఆయన గట్టిగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం.

‘పట్నం’కు దక్కేనా..
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి బరిలో దిగి ఓటమి పాలైన మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి ప్రస్తుతం చేవెళ్ల పార్లమెంట్‌ స్థానంపై దృష్టి కేంద్రీకరించారు. ఈ స్థానం తనకేనని సంకేతాలిస్తున్న ఆయన.. కొన్ని రోజులుగా గ్రామాల్లో పర్యటిస్తూ ప్రచారంలో నిమగ్నమయ్యారు. మరోపక్క గులాబీ గూటి నుంచి వెళ్లిపోయి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న ప్రస్తుత ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

కొండా కూడా బలమైన నేత కావడంతో టీఆర్‌ఎస్‌ నుంచి పటిష్ట క్యాడర్‌ ఉన్న మహేందర్‌రెడ్డినే బరిలోకి దించాలన్న ఆలోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతలో స్వామిగౌడ్‌ పేరు తెరమీదకు రావడంతో టికెట్‌ కోసం పోటీ తప్పేలా లేదు. టికెట్‌ కేటాయింపుపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తమ నేతకు హామీ ఇచ్చినట్లు మహేందర్‌రెడ్డి అనుచరులు ప్రచారం చేస్తున్నారు.   మొత్తం మీద చేవెళ్ల టికెట్‌ అధికార పార్టీ నుంచి ఎవరికి దక్కుతుందో అన్న అంశం సస్పెన్స్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement