నిజామాబాద్: పెళ్లయిన ఆరు నెలలకే ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మూడో టౌన్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీహరి కథనం ప్రకారం.. నగరంలోని చంద్రశేఖర్ కాలనీకి చెందిన రాజేశ్వరికి మహారాష్ట్రకు చెందిన మహేందర్ (25)తో ఆరు నెలల కింద వివాహం జరిగింది. వీరు ప్రస్తుతం హమల్‌వాడి సాయిబాబా ఆలయం సమీపంలో అద్దెకు ఉంటున్నారు. వివాహమైన కొద్ది రోజుల నుంచే దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్య పది రోజుల కింద భర్తను వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది.
ఈ నేపథ్యంలో మహేందర్ బుధవారం రాత్రి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. గది నుంచి పొగలు రావడం గమనించిన ఇంటి యజమాని అక్కడకు వెళ్లి చూడగా మహేందర్ మంటల్లో కాలిపోతూ కనిపించాడు. అతడ్ని కాపాడే ప్రయత్నం చేయగా, అప్పటికే మృతి చెందాడు. మహేందర్ మృతికి స్పష్టమైన కారణాలు తెలియరాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.