మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్): పెళ్లి పీఠలెక్కాల్సిన యువతి అర్ధాంతరంగా తనువు చాలించిం ది. కారణాలేమిటో తెలియదు కాని ఆత్మహత్యకు పాల్పడింది. నాల్గో టౌన్ ఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. నాల్గోటౌ న్ పోలీస్‌స్టేషన్ పరిధి మహాలక్ష్మీనగర్ కాలనీకి చెందిన గంగాధర్‌గౌడ్ ఆర్టీసీ ఆర్‌ఎం కార్యాలయంలో ఏడీసీ. ఇతనికి ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు ప్రజ్ఞ(26) వివాహం మోపాల్ మండలం నర్సింగ్‌పల్లికి చెందిన యువకుడితో ఇటీవల నిశ్చయమైంది. ఈనెల 20న నిశ్చితార్థం, మే 6న వివాహం జరగాల్సి ఉంది. ప్రజ్ఞ రెండు రోజుల క్రితం పెళ్లి షాపింగ్ కూడా చేసింది. మొదటి పెళ్లిపత్రికను తిరుమల వెంకన్న పాదాల వద్ద ఉంచేందుకు తల్లిదండ్రులు సోమవారం తిరుపతి వెళ్లారు.
మంగళవారం మధ్యాహ్నం ప్రజ్ఞ తన బెడ్‌రూంలోకి వెళ్లి తలుపు పెట్టుకుంది. కొద్దిసేపటికి ఇంటి ఆవరణలో ఉన్న పిల్లలు వచ్చి తలుపుకొట్టగా ఆమె తలుపు తీయలేదు. చుట్టుపక్కల వాళ్లు ప్రయత్నించి చివరికి బెంగుళూర్‌లో ఉన్న ప్రజ్ఞ అన్నకు ఫోన్ చేశారు. ఆయన నిజామాబాద్‌లో తనకు తెలిసిన వారికి ఫోన్ చేయగా వారు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై శంకర్, పోలీసులు అక్కడికి చేరుకుని బలవంతంగా తలుపులు తెరిచి చూడగా, ప్రజ్ఞ చున్నీకి వేలాడుతూ కనిపించింది. అప్పటికే ఆమె మృతి చెంది ఉండడంతో బంధువులు గుండెలు బాధుకున్నారు. అనంతరం ఎస్సై మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
అనుమానాలెన్నో..!
వచ్చే నెల 6న వివాహం జరగాల్సిన ప్రజ్ఞ మెడలో పసుపు తాళి కనిపించింది. అలాగే బెడ్‌రూంలో బెడ్‌పై పూలు చల్లి ఉండటం, పండ్లు, స్వీట్లతో పాటు హ్యాపీ వెడ్డింగ్ డే అని రాసిన కేక్‌ను కనిపించడంతో చూసిన వారు ఆశ్చర్యపోయారు. ఆమె మెడలో ఎవరైనా పసుపుతాళి కట్టారా.? ప్రజ్ఞ ఎవరినైనా ప్రేమిస్తే అతనితో తాళి కట్టించుకుందా? తాళి కట్టాక జరిగిన పరిణామాల అనంతరం ఇద్దరి మధ్య ఏదైనా ఘటన జరిగితే మనస్తాపంతో ఆమె ఉరి వేసుకుందా? అని అనుమానాలు తలెత్తుతున్నాయి. వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రజ్ఞ సెల్‌ఫోన్ కాల్‌డేటా ఆధారంగా నగర సీఐ సుభాష్ చంద్రబోస్ విచారణ చేపట్టారు. రెండు రోజుల్లో కేసును ఛేదిస్తామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment