సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 2,500 రైతు సమావేశ మందిరాలను నిర్మించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. వాటి నిర్మాణాలకు రూ.300 కోట్ల కేటాయింపునకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపారని వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని అధికారులు తెలిపారు. ఒక్కో సమావేశ మందిరానికి రూ.12 లక్షల చొప్పున కేటాయించాలని సీఎం నిర్ణయించారు.
వాస్తవంగా సమావేశ మందిరాలకు సంబంధించి రెండు మూడు ప్రణాళికలతో వ్యవసాయశాఖ సీఎం వద్ద ప్రతిపాదనలు పెట్టినట్లు తెలిసింది. మందిరాలను రూ.25 లక్షలు, రూ.20 లక్షలతో నిర్మించేలా ప్రతిపాదనలు ముఖ్యమంత్రి ముందు ఉంచారు. ఆడంబరంగా మందిరాలు అవసరం లేదని, సమావేశాలు పెట్టుకునేలా ఉంటే సరిపోతుందని కేసీఆర్ అన్నట్లు సమాచారం. దీంతో రూ. 12 లక్షలతో నిర్మించేందుకు నిర్ణయించారు.
ఏఈవో క్లస్టర్ల వారీగా మందిరాలు...
రాష్ట్రంలో 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో) ఉన్నారు. ఆ ప్రకారం ప్రతీ మూడు గ్రామాలకు ఒక ఏఈవో నియమితులయ్యారు. ప్రస్తుతం 2,500 మంది ఏఈవోలున్నారు. మూడు గ్రామాలకు కలిపి అందరికీ అందుబాటులో ఉండే గ్రామంలో రైతు సమావేశ మందిరాలను నిర్మిస్తారు. గ్రామంలో దాతల ద్వారా స్థల సేకరణ చేసే అవకాశముంది. ఆ స్థలంలోనే సమావేశ మందిరాలను నిర్మిస్తారు. మైకు, కుర్చీలు, ఇతర మౌలిక సదుపాయాలు ఉండేలా తీర్చిదిద్దుతారు. ఆ మూడు గ్రామాలకు చెందిన రైతు సమితి సభ్యుల సమావేశాలు అక్కడే నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేస్తారు.
అంతేకాదు రైతులకు శిక్షణ, పథకాలపై అవగాహన వంటివి ఈ మందిరాల్లోనే నిర్వహిస్తారు. రైతులకు సంబంధించిన ప్రతీ కార్యక్రమం ఇక్కడే నిర్వహిస్తారు. దీంతో ఏఈవో క్లస్టర్లు కీలకం కానున్నాయి. ఇప్పటివరకు మండల స్థాయిలోనూ ఇలాంటి సమావేశ మందిరాలు లేవు. కనీసం వ్యవసాయాధికారులకు కూడా మండలాల్లో పూర్తిస్థాయిలో కార్యాలయాలు లేవు. అటువంటిది మూడు గ్రామాలకు కలిపి ఒక సమావేశ మందిరం నిర్మిస్తుండటంతో రైతుల వద్దకు ప్రభుత్వ పథకాలు చేరే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment