తీపి కబురు
Published Fri, Nov 27 2015 12:07 AM | Last Updated on Sun, Sep 3 2017 1:04 PM
చెరకు రైతుకు టన్నుకు రూ.2600 చెరకు ఫ్యాక్టరీల అంగీకారం
త్వరలోనే క్రషింగ్ షురూ పద్మాదేవేందర్‌రెడ్డి వెల్లడి
మెదక్: చెరకు రైతుకు టన్నుకు రూ.2600 చెల్లించడానికి ఆయా ఫ్యాక్టరీల యాజమాన్యాలు అంగీకరించాయి. త్వరలో క్రషింగ్ కూడా ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి వెల్లడించారు. గురువారం ఆమె హైదరాబాద్‌లో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన ఛాంబర్‌లో గణపతి ఖండసార ఫ్యాక్టరీ (సంగారెడ్డి), గాయత్రి కర్మాగారం (కామారెడ్డి), మాగి ఫ్యాక్టరీ (నిజాంసాగర్) యాజమాన్యాలతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. గత ఏడాది మాదిరే ఈసారీ చెరుకు రైతులకు టన్నుకు రూ.2600 చొప్పున చెల్లించాలని యాజమాన్యాలకు సూచించామని సమావేశానంతరం పద్మాదేవేందర్‌రెడ్డి చెప్పారు. రవాణా చార్జీలను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. చెరకు పంట పూర్తయ్యే వరకు క్రషింగ్ నడుస్తుందని ఆమె భరోసానిచ్చారు.
Advertisement