ప్రమాదంలో చిన్నారుల ఆరోగ్యం.. | 27 Children Corona Cases in Gandhi Hospital Hyderabad | Sakshi
Sakshi News home page

ఒత్తిళ్లలో పొత్తిళ్లు!

Published Fri, Apr 17 2020 11:15 AM | Last Updated on Fri, Apr 17 2020 11:39 AM

27 Children Corona Cases in Gandhi Hospital Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: చిన్నారుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన నవజాత శిశువులు, ఇతర పిల్లలు ఒకరి తర్వాత మరొకరు కరోనా వైరస్‌తో ఐసోలేషన్‌ వార్డుల్లో చేరుతున్నారు. ఒకవైపు దగ్గు, జలుబు, జ్వరం, నిమోనియా వంటి అనారోగ్య సమస్యలు.. మరోవైపు తల్లిదండ్రులకు దూరంగా ఐసోలేషన్‌ వార్డులో మంచంపై ఒంటరిగా ఉండలేక గుక్కపట్టి ఏడుస్తున్నారు. వీరిని ఓదార్చడం వైద్య సిబ్బందికి పెద్ద సమస్యగా మారింది.  అంతేకాకుండా పెద్దలకు ఇచ్చే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మందులు కూడా వీరికి ఇచ్చే పరిస్థితి లేదు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడటం వైద్యులకు పెద్ద సవాల్‌గా మారింది. వీరిలో ఎవరికైనా వెంటిలేటర్‌ చికిత్సలు అవసరమైతే పరిస్థితి ఏమిటనే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు. 

23 రోజుల శిశువు సైతం..  
ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో ఏడో అంతస్తులో 280 మంది, ఆరో అంతస్తులో 107 మంది, ఐదో అంతస్తులో 136 మంది చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో మొత్తం 565 మంది బాధితులు ఉండగా, వీరిలో 27 మంది 14 ఏళ్లలోపు చిన్నారులే కావడం గమనార్హం. వీరంతా పీడియాట్రిక్‌ ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న పిల్లల్లో విజయనగర్‌ కాలనీకి చెందిన 23 రోజుల నవజాత శిశువు సహా ఆసిఫ్‌నగర్‌కు చెందిన ఆరు నెలల పాప కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.  

సెంకడరీ కాంటాక్ట్‌లతోనే..  
నిత్యం తల్లిదండ్రులను అంటిపెట్టుకునే పిల్లలు ఒంటరిగా ఉండలేకపోతున్నారు. వీరికి సహాయంగా వచ్చిన తల్లిదండ్రులకు వేరే వార్డులో వసతి కల్పించారు. అత్యవసర పరిస్థితులో వీరిని వారి దగ్గరికి పిలిపించి, ఓదార్చి పంపిస్తున్నారు. పిల్లలను తల్లులు కూడా ముట్టుకునే పరిస్థితి లేదు. నిజానికి వీరిలో ఏ ఒక్కరికి కూడా ప్రైమరీ కాంటాక్ట్‌లతో ప్రత్యక్ష సంబంధాలు లేవు. కొంత మందికి మర్కజ్‌కు వెళ్లి వచ్చిన భర్త నుంచి భార్యకు.. ఆమె నుంచి ఆమె పిల్లలకు వైరస్‌ సోకుతుండగా, ఇంకొంత మందికి తాత, నాన్న, పెద్దనాన్న, బాబాయ్, మామల నుంచి  వైరస్‌ సోకినట్లు తెలుస్తోంది.

వైద్యుల సూచన మేరకే పాలు
కరోనా వైరస్‌ సోకిన పిల్లల కోసం ఆస్పత్రి ఆరో అంతస్తులో పీడియాట్రిక్‌ ఐసీయూ ఏర్పాటు చేశారు. వైరస్‌ సోకిన పిల్లలను ఇక్కడే ఉంచుతున్నారు. నవజాత శివువులను ఇంకుబేటర్‌లపై ఉంచి చికిత్సలు అందిస్తున్నారు. మిగిలిన వారికి సాధారణ పడకలపై ఉంచుతున్నారు. వైరస్‌ తీవ్రత ఎక్కువ ఉన్న వాళ్లకి తల్లుల పాలు కాకుండా డబ్బా పాలు పడుతున్నారు. తక్కువ తీవ్రత ఉన్న మరి కొంత మందికి వైద్యుల సూచన మేరకు తల్లులే పాలు ఇస్తున్నారు. మిగిలిన వారికి మూడు పూటలా ఆహారం అందజేస్తున్నారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం రైస్, సాయంత్రం స్నాక్స్, రాత్రి చపాతీ లేదా రైస్‌ ఇస్తున్నారు. పిల్లలతో పాటు వారి తల్లులకు కూడా పాజిటివ్‌ ఉండటంతో వారిని కూడా ఆ పక్క వార్డులోనే ఉంచి వారికి కూడా చికిత్సలు అందిస్తున్నారు. పిల్లలకు యాంటీబయాటిక్, క్లోరోక్విన్‌ చిల్డ్రెన్‌ డోస్‌ మందులు వాడుతున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement