29 మంది విద్యార్థినులకు అస్వస్థత
నెల్లికుదురు కస్తూర్బా పాఠశాలలో పురుగుల అన్నం
నెల్లికుదురు (మహబూబాబాద్): పురుగుల అన్నం తిని 29 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన నెల్లికుదురులోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో శనివారం అర్ధరాత్రి జరిగింది. ఈ విద్యాలయంలో 198 మంది విద్యార్థినులకు గాను ప్రస్తుతం 143 మంది ఉంటున్నారు. శనివారం పురుగులున్న బియ్యంతో వండి సరిగ్గా ఉడకని అన్నం తినడంతో 29 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అర్ధరాత్రి సమయంలో వారిని స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లగా వైద్య సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడంతో రాత్రి 11 గంటలకు అంబులెన్స్‌లో రెండు దఫాలుగా మహబూబాబాద్‌లోని ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు నైట్ ఇన్‌చార్జ్ టీచర్ మాలోతు మంజుల తెలిపారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతి మీనా ఆదేశానుసారం జిల్లా వైద్యాధికారి శ్రీరాం నెల్లికుదురులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆదివారం స్థానిక మండల వైద్యాధికారి జ్యోతి తో కలసి సందర్శించారు.
వంట సామాన్లు భద్రపరిచే గది, తాగునీరు, నిరుపయోగంగా ఉన్న మినరల్ వాటర్ ప్లాంటు, మరుగుదొడ్లు, పరిసర ప్రాంతా లను పరిశీలించారు. పురుగుల అన్నం పెడుతున్నారని తినలేకపోతున్నామని ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదని, శనివారం రాత్రి సరిగ్గా ఉడకని పురుగుల అన్నం పెట్టారని విద్యార్థినులు శ్రీరాం దృష్టికి తెచ్చారు. శ్రీరాం విలేకరులతో మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాల పరిసరాలు అపరిశుభ్రంగాఉన్నాయని, హెడ్‌కుక్ నిర్లక్ష్యంతో పురుగుల అన్నం పెట్టడం వల్ల పిల్లలు అస్వస్థతకు గురయ్యారని అన్నారు. ఈ విషయాలన్నీ కలెక్టర్‌కు నివేదిస్తానని చెప్పారు.